Jul 12,2023 23:55

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని గ్రామాల్లో ఎన్‌టిఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. గురువారం సిఎం వైయస్‌.జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈమేరకు ఆమోదం తెలిపారు. ఆర్‌-5 జోన్‌తో పాటు ఎస్‌-3 జోన్‌లో కేటాయించిన స్థలాల్లో ఈ నెల 24న ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి మండలిలో నిర్ణయించారు. 25 లే అవుట్లలో 50,793 మందికి 1366.48 ఎకరాల్లో విస్తీర్ణంలో పట్టాలివ్వగా 47,017 ఇళ్లు మంజూరయ్యాయి. ఇళ్ల నిర్మాణం చేపట్టనున్న లే అవుట్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.384.52 కోట్లు కేటాయింపునకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇళ్ల నిర్మాణంకు తొలుత అనుమతి ఇచ్చి కోర్టు కేసులు తేలే వరకు తాము నిధులు మంజూరు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తొలి విడత 47,017 ఇళ్లు నిర్మించి తీరాలని నిర్ణయించింది. ఇందుకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.
అయితే ఈనెల 17 నుంచి రాజధానిలో ఆర్‌-5లో స్థలాల కేటాయింపుపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించనుంది. స్థలాల కేటాయింపు, ఇళ్లనిర్మాణంపై రైతులు దాఖలు చేసిన పిటీషన్లపై రాష్ట్ర హైకోర్టు విచారణ జరపనుంది. ఈ నేపధ్యంలో ఇళ్ల నిర్మాణం విషయంలో లబ్ధిదారుల్లో నెలకొన్న అమోమయంపై హైకోర్టు ఇచ్చే తీర్పుతో స్పష్టత రానుంది. ఈ అంశంలో కోర్టులో కేసులు కొనసాగుతున్నా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ఈనెల 8న ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగాల్సి ఉన్నా కేంద్రం పెట్టిన మెలిక వల్ల శంకుస్థాపన నిలిచిపోగా ఈ కార్యక్రమాన్ని ఈనెల 24న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 25 లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత ఉందని అధికారులు,కాంట్రాక్టర్లు తటపటాయిస్తున్న నేపధ్యంలో ఒకేసారి రూ.384.52 కోట్ల మంజూరుకు కూడా బుధవారం మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఇక పనులు వేగం పుంజుకోనున్నాయి.