Feb 28,2021 16:32

విజయవాడ : అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని, రాజధాని రైతుల ఉద్యమంపై ఎపి ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి దారుణమని అమరావతి మహిళా జెఎసి నేత, ఎపి కాంగ్రెస్‌ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. ఆదివారం సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించి పలు దఫాలుగా రైతులతో చర్చించిందని, మరి ఎపి లో ఒక్కసారైనా ముఖ్యమంత్రి జగన్‌ రైతులతో మాట్లాడారా ? అని ప్రశ్నించారు. రాజధాని కోసం ఒకవైపు అన్నదాతలు తనువు చాలిస్తున్నారని ఆవేదన చెందారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులు, మహిళలు 440 రోజుల తరబడి పోరాటం చేస్తున్నారని చెప్పారు. అమరావతి రాజధాని సమస్యకు ప్రభుత్వం ఒక పరిష్కారం చూపాలని కోరారు. రైతులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించాలని సుంకర పద్మశ్రీ డిమాండ్‌ చేశారు. ఈ కమిటీలో సిట్టింగ్‌ జడ్జి, ఐఎఎస్‌ అధికారులతోపాటు రైతులంటే గౌరవం ఉన్న రాష్ట్ర మంత్రి సభ్యులుగా ఉండాలని అన్నారు. అన్నదాత కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్న సంగతి జగన్‌ గుర్తు పెట్టుకోవాలని సుంకర పద్మశ్రీ సూచించారు.