వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులివ్వని బిజెపి దీనంతటి నుంచి తాను రాజకీయ ప్రయోజనం పొందడానికి పొంచి కూచుంది. తాజాగా కాగ్ నివేదిక చూస్తే కేంద్రం నుంచి నిధుల తగ్గుదల కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితికి ఒక కారణమని స్పష్టమవుతుంది. అయితే ప్రధాన ప్రాంతీయ పార్టీలు దాన్ని పల్లెత్తుమాట అనడానికి సిద్ధంగా లేవు. తమలో తాము కీచులాడుకుంటూ వ్యర్థ వివాదాలలో మునిగితేలుతూ బిజెపి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. దక్షిణాది మండలి సమావేశంలోనూ తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేంద్రం నుంచి రావలసినవాటిపై గట్టిగా మాట్లాడినా నిజంగా పోరాడతారన్న, పట్టుపడతారన్న నమ్మకం ఎవరికీ లేదు. రాజధాని సంక్షోభానికి, ప్రాంతాల అసమతుల్యతకు బీజాలు వేసిన టిడిపి కూడా మోడీ సర్కారు జోలికిపోదు.
పాలనా వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు పేరిట గతంలో చేసిన చట్టాలను సోమవారం నాడు హఠాత్తుగా జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. శాసనసభలో బిల్లులు ఆమోదింపచేసుకుంది. వైఎస్‌ఆర్‌సిపి తప్ప అన్ని పార్టీలూ రాష్ట్ర స్థాయిలో వ్యతిరేకించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం మంచిదైనా తర్వాతి ఘట్టం మరింత అయోమయంగా మారింది. తమ విధానంలో మార్పు లేదని మరింత మెరుగైన పటిష్టమైన రూపంలో సభ ముందుకు వస్తామని ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అనుసరించిన కేంద్రీకృత నమూనాకు భిన్నంగా వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిస్తామని, ఆ క్రమంలో ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించేందుకే బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. హైదరాబాదు లోనే మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఐ.టి కేంద్రీకరణ వల్ల కలిగిన నష్టాలనూ, రాయలసీమకు శ్రీబాగ్ ఒడంబడిక హామీలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు చేపట్టిన అమరావతి ఆర్భాటపు ప్రణాళిక అనీ, కనీసంగా రోడ్లు సదుపాయాలు కలిగించడానికే రూ. లక్ష కోట్లు ఖర్చవుతుందని ఉభయులూ లెక్క చెప్పారు. విజయవాడ, గుంటూరు రెంటికీ చెందకుండా ఇంత ఖర్చుతో మరో రాజధాని నిర్మాణం ఆచరణ సాధ్యం కాదని వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో పెద్దదైన విశాఖపట్నంలో చాలా నిర్మాణాలు ఇప్పటికే వున్నాయి గనక పాలనా రాజధాని అక్కడికి తరలిస్తే మంచిదని జగన్ పునరుద్ఘాటించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం గత రాజధాని కర్నూలులో హైకోర్టు పెట్టాలని భావించామన్నారు. విభజన తర్వాత కొత్త రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులకు విరుద్ధంగా వ్యాపార వర్గాల ప్రోద్బలంతో చంద్రబాబు నాయుడు అమరావతిని మొదలుపెట్టారని విమర్శించారు.
కోర్టు చిక్కుల వల్లనే !
ఇవన్నీ ఒక ఎత్తయితే ఇకముందు ఏం చేయబోతున్నారు, ఎప్పటిలోగా అనేది అనిశ్చితంగానే వదిలేశారు. ఆంధ్ర (రాష్ట్ర)ó రాజధానిని అయిదోసారి అయోమయంలోకి నెట్టారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాసు ఆంధ్రకే రావాలని ఆంధ్రకేసరి ప్రకాశం వంటివారు అనాలోచితంగా పట్టుపట్టారు. అప్పట్లో శాసనసభలో పెద్ద శక్తిగా వున్న కమ్యూనిస్టులే వాస్తవిక వైఖరి తీసుకుని రాష్ట్రావతరణను సుగమం చేశారు. అయినా రాజధాని రభస తప్పలేదు. కర్నూలు, హైదరాబాదు, ఆ పైన అమరావతి, ఆ తర్వాత మూడు రాజధానులు ఇప్పుడు మరో పటిష్టమైన బిల్లుతో తిరిగిరావడం దగ్గర ఆగిపోయాము. ఇది ఎలా ముగుస్తుందనేది ఏలినవారు స్పష్టంగా చెప్పగల స్థితి లేదు. కోర్టుల్లో కేసులు, విచారణలు నడుస్తున్నాయి. అమరావతి పాదయాత్రలూ సాగుతున్నాయి. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వని మోడీ ప్రభుత్వం, బిజెపి కేంద్ర నేతలు కనీసం ఈ ప్రతిష్టంభన తొలగించడానికైనా జోక్యం చేసుకోలేదు. ఇటీవల తిరుపతి వచ్చిన హోంమంత్రి అమిత్ షా మాత్రం రాష్ట్ర శాఖ నాయకులను పాదయాత్రలో పాల్గొనవలసిందిగా సలహా ఇచ్చి వెళ్లారు. బిజెపి ఈ ద్వంద్వనీతిని ఆచరణలో పెట్టిన మర్నాడే జగన్ ప్రభుత్వం శాసనసభలో పైబిల్లులను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. చంద్రబాబు అద్భుతమైన రాజధాని ప్రణాళికతో రెండు లక్షల కోట్ల సంపద సృష్టిస్తే జగన్ వచ్చి సర్వనాశనం చేశారని విమర్శిస్తున్న టిడిపి నాయకత్వం ఈ ఉపసంహరణను కుట్ర, కుతంత్రం అంటూ కొట్టిపారేయడం విశేషం. రాజధాని నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాలనూ ఈ ప్రభుత్వ ఏకపక్ష మార్పులను కూడా వ్యతిరేకించి స్థానిక ప్రజలు రైతుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న సిపిఎం వంటి పార్టీలు సంఘాలూ ఉపసంహరణను స్వాగతిస్తూ అమరావతి నిర్మాణాలు వెంటనే కొనసాగించాలని కోరాయి. ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. కోర్టు కేసులు సాంకేతికంగా సమస్యలు సృష్టించడం వల్లనే వెనక్కు తగ్గామని అధికారికంగానే అంగీకరించింది. బిల్లును సెలెక్ట్‌్‌్‌్‌్‌్‌్ కమిటీకి పంపాలనే శాసనమండలి గత చైర్మన్ రూలింగ్‌ను పక్కన పెట్టి మరోసారి ఆమోదించడం చెల్లదంటూ దాఖలైన కేసు అందులో ముఖ్యమైంది. దీన్ని ప్రభుత్వ ప్రతిపాదనలోనే ప్రస్తావించారు. ఈ కేసే ముందు తీసుకుని వుంటే ఇంతకాలం పట్టేది కాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత కుమార్ మిశ్రా వ్యాఖ్యానించడం గమనార్హం. పైగా ఈ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థతో ఘర్షణ వాతావరణమే కొనసాగుతున్న పరిస్థితి. విచారణ ప్రారంభంలోనే ఇద్దరు న్యాయమూర్తులను ధర్మాసనం నుంచి తప్పుకోవాలని కోరడం అందుకు ఉదాహరణ. సహజంగానే ఆ కోర్కె నిరాకరించబడింది. కనుక న్యాయ రాజకీయ కారణాల వల్ల మాత్రమ్లే బిల్లులు వెనక్కు తీసుకున్నారన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో ప్రభుత్వ విధాన నిర్ణయం వల్ల ప్రభావితులయ్యే వారితో మరింత చర్చ జరుపుతామనీ అన్నారు. ఆరు వందల రోజుల పైబడి అక్కడే దీక్షలు చేసేవారిని కేవలం పెయిడ్ ఆర్టిస్టులుగా రియల్ ఎస్టేట్ ఏజంట్లుగా ఇప్పటికీ అవహేళన చేస్తూ అనేక సార్లు పోలీసులను ప్రయోగించిన ఈ ప్రభుత్వం వారితో ఇప్పుడు చర్చలు జరుపుతుందని ఆశించలేము. వెనువెంటనే ప్రత్యామ్నాయ బిల్లులు కూడా తెచ్చే ఆలోచన, అవకాశం కనిపించవు. 2022లో అత్యున్నత న్యాయ వ్యవస్థలో కీలకమైన మార్పుల తర్వాతనే సరికొత్త ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు రావచ్చు. అందులో సాంకేతికంగా మూడు రాజధానులనే మాట మాత్రం ఉపయోగించకుండా జాగ్రత్త పడవచ్చు.
అమరావతిలో అవశ్య కర్తవ్యం
కొత్తగా తెచ్చిన చట్టాల రద్దుతో అమరావతికి మళ్లీ రాజధాని హోదా సంక్రమించినట్టవుతుంది. నిజానికి గతంలో హైకోర్టు స్టే ఇచ్చినప్పుడే ఆ పరిస్థితి వచ్చింది గాని రాజకీయ కొనసాగింపు లేకపోయింది. ఇప్పుడు అధికారికంగా వెనక్కు తీసుకోవడంతో చట్టపరంగా సిఆర్‌డిఎ పునరుద్ధరణ జరిగినట్టే. రైతులతో చేసుకున్న పాత ఒప్పందాలూ తిరిగి ప్రాణం పోసుకున్నట్టు భావించాల్సి వుంటుంది. అందులో ముఖ్యమైంది 30 వేల ఎకరాలకు పైగా భూములిచ్చిన రైతులకు సంబంధించిన ఒప్పందాలే. ఎకరా భూమి ఇచ్చిన వారికి 1000 చదరపు గజాల నివాస ప్లాటు, 500 చ.గ.వాణిజ్య ప్లాటు ఇస్తామన్న గత ప్రభుత్వం ఆ పని పూర్తి చేయలేదు. కాగితాల పైన ప్లాట్లు చూపించడం తప్ప నిజంగా అప్పగించింది లేదు. వీరిలో అత్యధికులు రైతులు కాదన్నది ఈ ప్రభుత్వ వైఖరి. కాని వారిలో 80 శాతం మంది చిన్నరైతులే. అవి రియల్టర్ల చేతి లోకి పోయాయన్న భావంతో ప్రభుత్వం లెక్కలు తీస్తున్నది. నిజమైన రైతులకు తప్ప రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం కొన్నవారికి ప్లాట్లు ఇవ్వనవసరం లేదనే విధానం జగన్ సర్కార్ అమలు చేయొచ్చు. ఏమైనా ఇదంతా వెంటనే పూర్తయ్యే వ్యవహారం కాదు. చంద్రబాబు ఊరించిన ప్రపంచ స్థాయి రాజధాని ఆలోచన అవాస్తవమని తేలిపోయింది గనక ఒక మోస్తరు టౌన్‌షిప్ లేదా మినీ సిటీ తరహాకే పరిమితమవుతామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడతో అనుసంధాన వంతెన పూర్తి చేస్తే తర్వాత దానికదే అభివృద్ధి అవుతుందనే ఆలోచనలో వున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు ఆయన మద్దతుదారులు చెబుతున్నట్టు అక్కడ రూ. రెండు లక్షల కోట్ల సంపద సృష్టి జరిగివుంటే వీరూ వదులుకునేవారు కాదు. అది రియల్ ఎస్టేట్ రేట్ల పెరుగుదలతో చెప్పేది మాత్రమే. వాస్తవంలో ఇప్పటి వరకూ అమరావతి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2500 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు, కేంద్రం రూ. రెండున్నర వేల కోట్లు (గుంటూరు, విజయవాడ ప్రాంతానికి మొత్తంగా) ఇచ్చినట్టు పిటిషనర్ల తరపు న్యాయవాది శ్యాం దివాన్ హైకోర్టులో అధికారికంగానే చెప్పారు. అంటే చాలా తక్కువగానే పని జరిగిందని అర్ధమవుతుంది. అయితే జగన్ ప్రభుత్వం ఆ కట్టిన వేలాది ఇళ్లను కూడా కేటాయించకపోవడం, అనేక నిర్మాణాలు అసంపూర్ణంగా వదిలివేయడం వల్ల చాలా నష్టం జరిగింది. ఇప్పటికైనా వాటిని పూర్తి చేసి అర్హులకు అప్పగిస్తే వాతావరణంలో సానుకూల మార్పు వస్తుంది. అర్హులైన వారికి ఒప్పందం మేరకు నివాస, వాణిజ్య ప్లాట్ల బదలాయింపు కూడా జరగాల్సి వుంటుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో వృత్తి వ్యాపారాల విస్తరణ, రైతులకు పరిహారం ప్రోత్సాహం, వ్యవసాయ కార్మికులు ఇతర రోజు కూలీలకు జీవనోపాధి కల్పన ప్రభుత్వ బాధ్యత. ఆ దిశలో ఏ విధమైన కార్యాచరణ చేపట్టేది చూడాలి. ఆలస్యానికి ఎంత మాత్రం తావులేని సమస్య ఇది.
హైకోర్టు తరలింపుపై నీలినీడలు
న్యాయ రాజధాని పద ప్రయోగం ఎలా వున్నా, కర్నూలుకు హైకోర్టు తరలింపు అవకాశాన్ని విచారణ సందర్భంలో హైకోర్టు ప్రశ్నించింది. ఈ మార్పును అన్ని పార్టీలూ బలపర్చినా, రాకరాక వచ్చిన ఉన్నత న్యాయస్థానాన్ని పోగొట్టుకోరాదనే భావం విజయవాడ, గుంటూరు న్యాయవాద వర్గాలలో వుంది. తెలంగాణ విభజన ఉద్యమ సమయంలోనూ హైకోర్టు ఒక ఉద్రిక్త బిందువుగా వుండటం గుర్తు చేసుకోవచ్చు. గతంలో ఒప్పందాల ప్రకారం రాజధాని కోస్తాలో వుంటే హైకోర్టు రాయలసీమలో వుండాలని స్థానికులు గట్టిగా భావిస్తున్నారు. హైకోర్టు వల్ల రాయలసీమకు ఉపయోగం పరిమితమనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నా అసలు రాకపోవడం దానికి పరిష్కారం కాబోదు. ఈ లోగా స్థానిక బిజెపి ఎం.పి (రాజ్యసభ) కర్నూలు, అమరావతి లలో శీతాకాల, వేసవి కాల సమావేశాలు జరపాలని ప్రతిపాదించారు. హైకోర్టు బదులు హైకోర్టు బెంచి పెడితే సరిపోతుందని ఆయనే అంటున్నారు. ప్రభుత్వం కర్నూలు జగన్నాథగట్టు పైన న్యాయ సముదాయం నిర్మిస్తున్నా ఇది కూడా సందిగ్ధంలో పడినట్టే.
విశాఖపై ఇప్పటికీ ఆశలు
రాజధాని మాట వాడకుండా పాలనా వ్యవహారాలలో విశాఖ నుంచి సి.ఎం ఎక్కువగా పనిచేస్తే దానికదే పాలనా రాజధాని అవుతుందని సన్నిహితులు ముఖ్యమంత్రికి సలహా ఇచ్చినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి చంద్రబాబు కూడా దాదాపు ప్రతివారం విశాఖలో ప్రత్యక్షమవుతుండేవారు. దేశానికి ముంబాయి లాగా ఎ.పి కి విశాఖ ఆర్థిక రాజధాని అవుతుందనే భావన ఒకటి బిజెపితో సహా చాలా మందిలో వుంది. అదానీ గ్రూపు వంటివి అక్కడ తిష్టవేయడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన కూడా ఈ కోవలోవే. అయితే హైదరాబాదులో కేంద్రీకృత నమూనా గురించి విమర్శిస్తూ వికేంద్రీకరణ పేరిట మళ్లీ విశాఖలో అదే పనిచేయడం సరైందేనా అన్న ప్రశ్న ఇక్కడ ఎదురవుతున్నది. అభివృద్ధి చెందిన విశాఖనే మరింత పెంచడం ఉత్తరాంధ్ర వెనకబాటుకు ఇది పరిష్కారమా అని కూడా సందేహాలున్నాయి. అది తమకు మరింత దూరమవుతుందనే ఆందోళన రాయలసీమ లోనూ వుంది. ఇవన్నీ హైకోర్టులో అంతిమంగా ఎలాంటి ఆదేశాలు వస్తాయన్న దానిపై ఆధారపడి వుంటాయి. కేసులు పూర్తిగా మూసేస్తే అప్పుడు ప్రభుత్వం ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేకుండా తన వ్యూహం అమలు చేస్తుంది. కొత్త బిల్లులు మాత్రం 2022 చివర్లో ప్రతిపాదించవచ్చు. అంటే అస్పష్టతలో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోవలసిందే. ఆ తర్వాత ఏదైనా జరిగేలోపే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. ఏతావాతా ఇది వచ్చే ఎన్నికల ఎజెండాగా తయారవుతుంది. ప్రాంతాలవారీ భిన్నాభిప్రాయాలను పెంచే ప్రయత్నాలూ జరగొచ్చు.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులివ్వని బిజెపి దీనంతటి నుంచి తాను రాజకీయ ప్రయోజనం పొందడానికి పొంచి కూచుంది. తాజాగా కాగ్ నివేదిక చూస్తే కేంద్రం నుంచి నిధుల తగ్గుదల కూడా రాష్ట్ర ఆర్థిక దుస్థితికి ఒక కారణమని స్పష్టమవుతుంది. అయితే ప్రధాన ప్రాంతీయ పార్టీలు దాన్ని పల్లెత్తుమాట అనడానికి సిద్ధంగా లేవు. తమలో తాము కీచులాడుకుంటూ వ్యర్థ వివాదాలలో మునిగితేలుతూ బిజెపి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. దక్షిణాది మండలి సమావేశంలోనూ తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేంద్రం నుంచి రావలసినవాటిపై గట్టిగా మాట్లాడినా నిజంగా పోరాడతారన్న, పట్టుపడతారన్న నమ్మకం ఎవరికీ లేదు. రాజధాని సంక్షోభానికి, ప్రాంతాల అసమతుల్యతకు బీజాలు వేసిన టిడిపి కూడా మోడీ సర్కారు జోలికిపోదు. పైగా రాష్ట్రపతి పాలన అడుగుతుంటుంది. రాజధాని నిర్మాణం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఏది జరగాలన్నా ప్రజలు, పార్టీలు సమైక్యంగానూ సరైన అవగాహనతో పోరాడితేనే సాధ్యమవుతుంది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల లబ్ధి కోసం వాటిని వాడుకోజూస్తే ఈ విభజిత రాష్ట్రం మరోసారి దారుణంగా నష్టపోక తప్పదు. రాజధాని అయోమయాన్ని తొలగించకపోతే రాజకీయ, ఆర్థిక మూల్యం చెల్లించడం అనివార్యమవుతుంది.
తెలకపల్లి రవి











