ప్రజాశక్తి - తుళ్లూరు: రాజధాని గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల పై వేధింపులు మానుకోవాలని,లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ హెచ్చరించారు. ఆదివారం రాత్రి రాజధాని ప్రాంతం తుళ్లూరులోని ప్రజాసంఘాల కార్యాలయంలో రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో నేతాజీ మాట్లాడుతూ సర్దుబాటు పేరుతో అధికారులు పారిశుధ్య కార్మికులను ఊళ్లు తిప్పుతున్నారని, సొంత గ్రామంలోనే కార్మికులకు విధులు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్మికులను పని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆదివారం కూడా పనిచేయమనడం ఏమిటని ప్రశ్నించారు. సచివాలయం ఇతర ప్రాంతాలలో పనిచేసే వారు వారంలో ఐదురోజులు ,పారిశుధ్య కార్మికులు మాత్రం ఏడు రోజులు పని చేయాలనడం సరి కాదన్నారు. కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించడంలో ఉన్న శ్రద్ద వారికి రక్షణ పరికరాలు అందించడంలో లేదని విమర్శించారు .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల ప్రయోజనాలు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు పారిశుధ్య కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందన్నారు. రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎం.రవి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులపై వేధింపులు నానాటికీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేధింపులపై ప్రశ్నిస్తే ' ఉంటే ఉండండి.. లేదంటే పోండి ' అంటూ అధికారులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికులకు పని భద్రతతో పాటు వేతనం రూ .21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.త ొలుత కార్మికులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.పెండింగ్ జీతాలు చెల్లించాలని, తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేస్తున్న ఆందోళనలలో గ్రామస్తులు భాగ స్వాములు కావాలని డిమాండ్ చేశారు. ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల్లో సాగింది. కార్యక్రమంలో సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం భాగ్య రాజు,పి.బాబూరావు,షేక్ జానీ,సి హెచ్ సుశీల, సుఖవేణి పాల్గొన్నారు.










