ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని ప్రాంతంలోని పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎం.రవి డిమాండ్ చేశారు. తుళ్లూరులో ఆదివారం చెరుకూరి సుశీల అధ్యక్షతన సంఘం విస్తృత సమావేశం నిర్వహించారు. రవి మాట్లాడుతూ మూణ్ణెల్లుగా జీతాలు రాక కార్మికులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అయినా సిఆర్‌డిఎ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు 18 నెలల పెండింగ్ పీఎఫ్ గురించి అడిగితే సూపర్‌వైజర్‌లు, కో-ఆర్డినేటర్ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని విమర్శించారు. కార్మికులందరికీ ఇఎస్‌ఐ కార్డులు ఇవ్వలేదన్నారు. పిఎఫ్, ఇఎస్‌ఐతో తమకు సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను చీటికిమాటికి పనిలో నుండి తొలగిస్తామంటూ కొంతమంది సూపర్‌వైజర్‌లు బెదిరింపులకు దిగుతున్నారని, పనిష్మెంట్ల పేరుతో రోజుల తరబడి కార్మికులను పనిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. అపరిశుభ్ర ప్రదేశాలలో పని చేస్తున్న కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని అన్నారు. వేధింపులతో మానసిక ఒత్తిడికి గురై కొంతమంది పారిశుధ్య కార్మికులు పని మానివేశారన్నారు. వేధింపులు కొనసాగితే మరో పోరాటానికి కార్మికుల సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్మికులకు రూ.15 వేల జీతం, రూ.6 వేలు మెడికల్ అలవెన్స్ కలిపి రూ.21 వేలు చెల్లించాల్సి ఉండగా, రూ.12 వేలతో సరిపెడుతున్నారని విమర్శించారు. మాస్కులు, గ్లౌజులు, సబ్బులు,కొబ్బరి నూనె, చెప్పులు, రెండు జతల యూనిఫారం ఇవ్వాలని, డిమాండ్ చేశారు. వీఇపై సిఐటియు ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళనలకు సిద్ధమని చెప్పారు. సమావేశంలో సంఘం నాయకులు వీరాంజనేయులు, రామాంజన ేయులు, జ్యోతి, మరియమ్మ, సుఖవేణి, కోటేశ్వరరావు, వీరలంకమ్మ, శిరీష, వెంకాయమ్మ, జైమేరీ, కల్యాణిలక్ష్మి, రత్నకుమారి, మార్తమ్మ, అరుణ కుమార్, మధురవాణి, మల్లేశ్వరి, శ్రీను, దేవదాస్, బుజ్జి, సుమలత పాల్గొన్నారు.










