ప్రజాశక్తి- కలెక్టరేట్ : పరిపాలనా రాజధాని ముసుగులో వైసిపి నేతలు విశాఖలో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారని, రూ.వేల కోట్ల విలువైన భూములను అప్పనంగా దోచుకుంటున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. నగరంలోని ఒక హోటల్లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమకు కావాల్సిన చోట సంతకం పెట్టలేదనే ఆగ్రహంతో జివిఎంసి గత కమిషనర్ లక్ష్మీశాను బదిలీ చేయించేశారన్నారు. సుమా రూ.వెయ్యి కోట్ల విలువైన భూముల్ని రేడియంట్ ప్రాజెక్టుకు కేవలం రూ.96 కోట్లకే వుడా అప్పగించిందని, ఆ ప్రాజెక్ట్ సాక్ష్యాత్తూ వైసిపి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిదని తెలిపారు. అంతేకాకుండా రూ.45 కోట్ల స్టాంపు డ్యూటీని మినహాయించుకునేలా చేశారని, దీనిలోనూ జివిఎంసికి నష్టం కలిగేలా చేశారని ఆరోపించారు. ఇవన్నీ చూసీ చూడనట్టు వదిలేయాలని లక్ష్మీశపై ఒత్తిడి చేయగా, ఆయన అంగీకరించకపోవడంతో బదిలీ చేయించారని ఆరోపించారు. భూములు కొల్ల గొట్టేస్తున్న వైసిపి నేతలపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయపోరాటానికీ వెనకాడేది లేదన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరి గిందని ఆరోపిస్తున్న వైసిపి నేతలు, విశాఖలో జరుగుతున్న భూ దందాపై ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.










