Aug 08,2021 12:37

అమరావతి : రాజధాని పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధాని గ్రామాల్లోకి ఇతరులను అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. రాజధాని అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీకి పిలుపునిచ్చారు. న్యాయస్థానం నుంచి మంగళగిరి ఆలయం వరకు మహిళలు, రైతులు ర్యాలీగా వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ తరుణంలో ఉద్యమకారులు చేపట్టనున్న ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు.  అమరావతి ప్రాంతంలో పలుచోట్ల ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించారు. రాజధాని గ్రామాల్లోకి మీడియా కూడా ప్రవేశం లేదని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. అమరావతికి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరులో సోదాలు చేస్తున్నారు. పలుచోట్ల నిరసనలకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతిని అంతం చేసేందుకు వైకాపా నేతలు కుట్రలు చేశారని టిడిపి నేత లోకేశ్‌ తెలిపారు. అమరావతి రైతుల పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని అచ్చెన్నాయుడు ప్రకటించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ అమరావతి రైతులు, ప్రజలపై ప్రభుత్వ నిర్భంధాన్ని ఖండించారు. అమరావతి రైతులకు, ప్రజలకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అమరావతిని రాజధానిగా కొనసాగించి పరిపాలన మొత్తం ఇక్కడ నుండే సాగాలని ప్రజలు చేస్తున్న ఆందోళనకు సిపిఎం మద్దతు తెలుపుతుందని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అమరావతి ఉద్యమానికి జేజేలు పలికారు.