May 13,2022 06:52

    బ్రిటిష్‌ వలస పాలన నాటి రాజద్రోహ చట్టం (ఐపిసి సెక్షన్‌ 124 ఎ) అమలును నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారంనాడు మధ్యంతర ఉత్తర్వులనివ్వడం హర్షణీయం. సెక్షన్‌ 124ఎ ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్‌, హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశించడం స్వాగతించదగిన పరిణామం. ప్రత్యర్థుల్ని, ప్రశ్నించేవారినీ అణచివేయాలని ప్రయత్నిస్తున్న మోడీ సర్కారుకు ఈ ఆదేశం ఒక చెంపపెట్టు వంటిది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్‌ కింద ఎలాంటి అరెస్టులు చేయడం కానీ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం కానీ కూడదని స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే నమోదైన కేసులపై చర్యలు తీసుకోవద్దని, విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశించడం ఈ అంశం పట్ల వారెంత సునిశితంగా ఉన్నారో విదితమవుతోంది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం వ్యాఖ్య సముచితమైనది. స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేయడం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని స్వరాజ్యాన్ని సాధించుకొని 75 ఏళ్లవుతున్నా, ఇంకా అమలు చేయడం తగదు. అమృతోత్సవాల పేరిట పాలకులు హంగామా చేస్తూ ఇలాంటి దుర్మార్గ చట్టాలను రద్దు చేయకుండా సమీక్ష చేస్తామనడం మోసపూరితం. నిన్న మొన్నటి వరకూ ఆ సెక్షన్‌ను కొనసాగించవచ్చుననీ, అయితే కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవుతున్నందున ఆ అవకాశం లేకుండా చేయాలని కేంద్ర మంత్రులూ, ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ కూడా చెబుతూ వచ్చారు. అయితే విచారణ జరిగినపుడల్లా ధర్మాసనం నిలదీయడంతో సర్కారు తాజాగా సమీక్ష పల్లవిని ఎత్తుకుంది. ''సమీక్ష పూర్తయ్యేంత వరకు ఈ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా నిలిపివేయడం అనేది సరైన విధానం కాద''ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. అంటే సమీక్ష పేరుతో తమ పని తాము చేసుకుపోవాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా వుంది. సుప్రీం కోర్టును కూడా ఏమార్చాలని మోడీ ప్రభుత్వం యత్నించడం క్షంతవ్యం కాదు.
     సుప్రీం కోర్టు ఆదేశాలపై స్పందిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కోర్టులకు ఉన్న స్వతంత్ర హోదాను, వాటి ఆదేశాలను గౌరవిస్తామంటూనే లక్ష్మణ రేఖను దాటకూడదు కదా అని వ్యాఖ్యానించడం సర్కారు చిత్తశుద్ధి లేమికి నిదర్శనం. అంతేగాక ప్రభుత్వం శాసన వ్యవస్థకు జవాబుదారీ వహించాలి; పార్లమెంట్‌ సభ్యులు ప్రజలకు జవాబుదారీ వహించాలి. మరి ఈ విషయాల్లో ఈ పాలకులు లక్ష్మణ రేఖ పాటిస్తున్నారా? మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజద్రోహ చట్టం కింద 326 మందిని అరెస్టు చేయగా అందులో ఆరు కేసులనే కోర్టులు నిర్ధారించాయంటే బిజెపి పాలనలో ఈ చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందో స్పష్టమే! ఇప్పటికే ఈ దుష్ట చట్టం కింద వందలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు. వారందరికీ ఇప్పుడైనా సంబంధిత కోర్టులు బెయిల్‌ మంజూరు చేయడం అవశ్యం. మరో క్రూర చట్టం యుఎపిఎ (ఉపా)పై కూడా సుప్రీం కోర్టు దృష్టిసారించాల్సిన అవసరముంది. చార్జిషీట్‌ దాఖలుకు నిర్దిష్ట కాలపరిమితి విధించకపోవడంవల్ల ఉపా కింద ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారు. స్టాన్‌స్వామి వంటివారు కారాగారంలోనే కాలధర్మం చెందిన దుస్థితి దయనీయమైనది. భీమా కోరెగావ్‌ కేసులో అనేకమంది హక్కుల కార్యకర్తలు, మేధావులు దాదాపు మూడేళ్లుగా కారాగారాల్లో మగ్గుతున్నా ఇంతవరకు కనీసం చార్జిషీట్‌ దాఖలు చేయకపోవడం దారుణం. రాజద్రోహ చట్టం విషయంలో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికైనా ఎన్‌ఐఎ, పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేయాలి.
     కార్పొరేట్ల విచ్చలవిడి దోపిడీకి గేట్లు బార్లా తెరవడం కోసం జాతీయోద్యమ కాలంనాటి నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల్ని నాలుగు కోడ్‌లుగా మార్చేసిన మోడీ సర్కారు బ్రిటిష్‌ వారు తెచ్చిన రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయడానికి నిరాకరించడం దుర్మార్గం. సుప్రీం కోర్టు ఆదేశం, దేశం నలుచెరగులా హక్కుల కార్యకర్తలు, ప్రజాతంత్ర శక్తుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే సెక్షన్‌ 124 ఎ రద్దుకు చర్యలు చేపట్టాలి.