Jul 07,2023 19:23

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి-రాయచోటి: రాహుల్‌ గాంధీపై పెట్టిన అక్రమ కేసు ఎత్తేయాలని నిరసనగా రాయచోటి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఎస్‌.అల్లా బకాష్‌ సిఎల్‌పి ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీపై బిజెపి పెట్టిన అక్రమ పరువు నష్టం కేసులో గుజరాత్‌ హైకోర్టు స్టే ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష నాయకులపై దేశవ్యాప్తంగా బిజెపి అక్రమ కేసులు పెట్టి వేధించడం శోచనీయమని తెలిపారు. బిజెపి తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్‌ భయపడదని పేర్కొన్నారు. పోలీసులను, న్యాయవ్యవస్థను అడ్డం పెట్టుకుని రాహుల్‌ గాంధీని, కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందులు పెట్టాలనుకోవడం దుర్మార్గమైన చర్య. మోడీ అవినీతి, అక్రమాలను పార్లమెంట్‌ సాక్షిగా ప్రశ్నించిన రాహుల్‌పై బిజెపి కక్ష సాధింపు చర్యలు అమానుషమని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీపై బిజెపి పెట్టిన అక్రమ కేసులపై దేశం యావత్తు గర్హిస్తుందని బిజెపి, మోడీ, అమిత్‌షా నిరంకుశ, నియంతత్వ పాలనకు త్వరలోనే దేశ ప్రజలు చరమగీతం పాడుతారని తెలిపారు. రాహుల్‌ గాంధీపై అక్రమ కేసులు విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం బిజెపి నియంతత్వ, అవినీతి ,అక్రమాలకు ఎదురోడ్డి పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్‌ గాంధీ కొనియాడారు. కార్యక్రమంలో సమన్వయకర్త ఖదీర్‌, మంజునాథ, నరేష్‌, చెన్నకృష్ణ దినకర్‌, రమణమ్మ, రఫీక్‌, వెంకటేశ్వర్లు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.