Oct 20,2022 23:40

రాహుల్‌ గాంధీతో పోలవరం నిర్వాసిత మండలాల కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి- చింతూరు
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దృష్టికి పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితుల సమస్యలను తీసుకెళ్లినట్లు చింతూరు మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఎండి హబీబ్‌ తెలిపారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఆయనను కలిసి ముంపు మండలాల్లో వరదలు, నిర్వాసితుల సమస్యలను విన్నవించినట్లు చెప్పారు. పోలవరం ముంపు పరిహారం విషయంలో మైదాన ప్రాంతాల్లో 30 నుండి 40 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తున్నారని, ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో సర్వం కోల్పోతున్నా నిర్వాసితులకు న్యాయపరమైన ప్యాకేజీ ఇవ్వడం లేదని తెలిపారు. పోలవరం పరిహారం ముందుగా ఇచ్చి ఆపై ప్రాజెక్టు నిర్మించాలని న్యాయ స్థానాలు, బాధితులు చెబుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో అన్ని ముంపు ప్రాంతాలకు సమ న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. నాలుగు సార్లు వచ్చిన వరదలకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, పోలవరం పరిహారం పూర్తిస్థాయిలో అందరికీ అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అధిక మొత్తంలో నిర్వాసితులు అందేలా చూడాలని కోరారు. సమస్యలపై స్పందించిన రాహుల్‌ గాంధీ ఈ విషయంపై లోక్‌సభ, రాజ్యసభలో గట్టిగా మాట్లాడటం జరుగుతుందని తెలిపారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే పోలవరం సమస్యలపై దృష్టిపెట్టి కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాహుల్‌ గాంధీని కలిసిన వారిలో ఎటపాక కాంగ్రెస్‌ నాయకులు నక్క ఎంకన్న, గంగులు నరసింహారావు, జెట్టి గురునాథం. యముడి అమర్‌ తదితరులున్నారు.