ప్రజాశక్తి-ఎటపాక
మండలంలోని నల్లకుంట గ్రామపంచాయతీ పరిధి రాఘవపురం గ్రామాన్ని పోలవరం ముప్పు జాబితాలో చేర్చి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలని సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు డేగల మాధవరావు డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి సీపీఎంలో భాగంగా బుధవారం రాఘవపురం గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అనేక సమస్యలు సిపిఎం బృందం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ పోలవరం ముంపులో ఉన్న రాఘవపురం గ్రామానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూమికి భూమి ఇవ్వాలని కోరారు. అధికారులు మాత్రం ఈ గ్రామానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జాబితాలో లేదని ప్రకటనలు చేస్తున్నారని, ఇటువంటి ప్రకటనలు మానుకొని సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల పోలవరం బ్యాక్ వాటర్‌తో ఈ గ్రామం మొత్తం పూర్తిగా నీట మునిగి సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఆన్లైన్లో చేర్చకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే ఆన్లైన్ చేసి నష్టపరిహారం ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సోయం వీరమ్మ, కాకా అర్జున్, సోంది రామారావు, ఊకె బాబు, జి హరి పాల్గొన్నారు.










