May 08,2023 23:21

చెరువులో మరణించిన చేపలు


-ఆందోళనలో మత్స్యకారులు
ప్రజాశక్తి - పెద్దాపురం
పెద్దాపురం మండలం రాయ భూపాలపట్నంలోని రాగమ్మ చెరువులో సోమవారం వేలాది చేపలు మరణించి నీటిపై తేలడంతో ఈ చెరువు లీజు దారులైన మత్స్య సహకార సంఘం సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్య సంపద చేతికి అంది వచ్చే సమయంలో లక్షలు విలువ చేసే చేపలు మరణించాయని మత్స్య సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు వడ్లపాటి చిన్న, ముసలయ్య, పెదపాటి సూరిబాబు, నరాల సత్యనారాయణ ,ఇంజుమళ్ల సూరిబాబు, రాయి దొరబాబు ఆవేదన వ్యక్తం చేశారు చెరువు నీటిలో విషం కలపటం వల్లనే ఇలా జరిగి ఉంటుందని తాము అనుమానిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై అధికారులు పరిశీలన జరిపి ప్రభుత్వం ద్వారా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మరణించిన చేపలు, నీటిని ల్యాబ్‌ కు పంపించాం
ఈ సంఘటనపై సమాచారం తెలిసిన వెంటనే ఎఫ్‌డిఒ కె.ప్రకాశరావు, విఎస్‌ ఎ పద్మశ్రీ, శ్రీనివాస్‌లు సంఘటన స్థలానికి వచ్చి చనిపోయిన చేపలను, చెరువు నీటిని పరిశీలించారు. చెరువు నీటిని, మరణించిన చేపల శాంపిల్స్‌ లాబ్‌కు పంపుతున్నామని రిపోర్టు వచ్చిన తర్వాత చేపల మరణానికి కారణం తెలుస్తుందన్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎంఎల్‌ఎ చినరాజప్ప
ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప సంఘటన జరిగిన రాగమ్మ చెరువు వద్దకు వెళ్లి పరిశీలన జరిపారు. ఈ సంఘటనపై చెరువు లీజ్‌ దారులతో ఆయన మాట్లాడారు. నష్టపోయిన మత్స్యకారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆయనవెంట టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, నూనె రామారావు, అరవింద కుమార్‌, కందుల విశ్వేశ్వరరావు,తూతిక రాజు ఉన్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన దొరబాబు
ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు,y ైసిపి నాయకులు రాగమ్మ చెరువు వద్దకు వచ్చి చనిపోయిన చేపలను పరిశీలించారు. లీజుదారులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ నల్లల నాగేంద్రబాబు, ఎంపిపి పెంకే సత్యవతి, సర్పంచ్‌ చీకట్ల లక్ష్మి, పరిమి శ్రీను ఉన్నారు. పాల్గొన్నారు.