Sep 11,2023 00:43

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి పోషక విలువలు గల రాగిజావను పంపిణీ చేస్తున్నారు. వారంలో మూడు రోజులపాటు మంగళ, గురు, శనివారాల్లో దీన్ని అందిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా వండి, వడ్డించి, పంపిణీ చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం పైసా విదల్చట్లేదు. పెరిగిన ధరలతో పోల్చుకుంటే మెనూ బిల్లులు సరిపోని కారణంగా ఇప్పటికే తీవ్రంగా సతమతమవుతున్న కార్మికులపై రాగిజావ మరో ఇబ్బందిని తెచ్చి పెట్టింది.
కాకినాడ జిల్లాలో 1,250 పాఠశాలల్లో 1,46,849 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రైమరీ విద్యార్థులు 42,960 మంది, యుపి విద్యార్థులు 12,403, హైస్కూలు విద్యార్థులు 91,486 మంది ఉన్నారు. వీరిలో 1,03,138 మంది మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. రాగి జావ మాత్రం 1.46 లక్షల మందికీ అందజేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో కాకినాడ అర్బన్‌ సహా 8 మండలాల్లో 504 పాఠశాలల్లో సుమారు 68 వేల మందికి అక్షయ పాత్ర, అల్లూరి సీతారామరాజు స్వచ్చంద సంస్థల నుంచి జావను వండి తెలుస్తున్నారు. మిగిలిన 78 వేల మందికి జిల్లాలో ఉన్న కార్మికులు పాఠశాలల్లోనే వండుతున్నారు. ఒక్కో విద్యార్థికి 10 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బెల్లం పొడి కలిపి ఉదయం 8:45 గంటలకు ఇవ్వాలని గైడెలెన్స్‌ జారీ చేశారు. ఉదయమే జావ తయారు చేసి పిల్లలకు ఇస్తున్నారు. గంట ముందే ఉపాధ్యాయులు పాఠశాలలకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు.
సరిపోని నిధులు
జావ తయారు చేస్తున్న కార్మికులకు అదనంగా పైసా కూడా ఇవ్వడం లేదు. గ్యాస్‌, నిత్యావసరాలు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం మెనూ కింద ఇచ్చే నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని కార్మికులు అనేకేళ్లుగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.5.88 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థికి రూ.8.57 చొప్పున మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. రైస్‌, గుడ్లు, చిక్కీలు, రాగి పిండి, బెల్లం సరఫరా చేస్తున్నా కూరగాయలు, ఆయిల్‌, కందిపప్పు, తదితర వస్తువులన్నీ ప్రభుత్వం ఇస్తున్నా కొద్ది కుకింగ్‌ చార్జీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్‌ ధర భారీగా పెరగ్గా, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు అకాశాన్నంటాయి. కొత్తగా రాగి జావ తయారీకి వాడే గ్యాస్‌ అదనపు భారమవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. 100 మంది విద్యార్థులకు జావ తయారీకు రూ.40 గ్యాస్‌ ఖర్చు అవుతుందని కార్మికులు తెలిపారు. నెలలో 15 రోజుల పాటు రాగిజావను కాయాల్సి వస్తుంది. ఫలితంగా గ్యాస్‌ త్వరగా అయిపోతుందని వారంటున్నారు. మరో వైపు ప్రభుత్వం దీని తయారీకి వంట పాత్రలు ఇస్తామని చెప్పినా నేటికీ ఇవ్వలేదు. దీంతో కార్మికులే వాటిని సమకూర్చుకుంటున్న పరిస్థితి ఉంది. గ్యాస్‌, వంట పాత్రల ఖర్చుతో బాటు శ్రమ కూడా పెరిగిందని తమకు మెనూ నిధులు, వేతనాలు పెంచాలని కోరుతున్నారు.