Oct 28,2023 22:21

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
రాబోవు ఎన్నికలకు సిద్ధం కావాలి, పాత నేరస్తులపై గట్టి నిఘా ఉంచి సైబర్‌ నేరగాళ్ళ ఉచ్చులో ప్రజలకు పడకుండా అప్రమత్తం చేయాలని శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేరసమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశించారు. ఎర్రచందనం, నాటుసారా, ఇసుక అక్రమ రవాణ నేరస్తులపై ఉక్కుపాదం మోపండి.. పిడి యాక్ట్‌లు ప్రయోగించాలన్నారు. జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో ఎస్పీ జిల్లా పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నెలవారీ నేరసమీక్షా సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ రాబోవు ఎన్నికల దృష్ట్యా ఎన్నికలను శాంతియుతంగా జరిపించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, అందరం ఇప్పటి నుండే సిద్ధంగా ఉండాలని ఎన్నికలు సజావుగా సాగేందుకు గల విషయాల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బెట్టింగ్‌ మాఫిj ను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేయాలని, బెట్టింగ్‌.. సరదాగా మొదలవుతున్న ఈ జాడ్యం.. తరువాత వ్యసనంగా మారుతోందన్నారు. బెట్టింగ్‌కి అలవాటుపడ్డ యువకులు దానికోసం ఎందాకైనా అప్పులు చేస్తున్నారు. తరువాత తీసుకున్న అప్పు కట్టలేక ప్రాణాలను సైతం బలితీసుకుంటు కన్నా వాళ్లకి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. పోలీసు అధికారులు అందరు బెట్టింగ్‌ను అడ్డుకోవాలని తెలియజేశారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌ అండ్‌ నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, 174 సిఆర్‌పిసి కేసులు, మిస్సింగ్‌, చీటింగ్‌, 102 కేసులు, సైబర్‌ నేరాలు, ఇతర కేసులను సమీక్షించారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్‌ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్‌, రికార్డ్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల ఛేదింపునకు, పరిష్కారానికి, నేరనియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు. జైలు నుండి విడుదలైన పాత నేరస్థులపై నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.