
వెంకయ్య అన్నం తింటుండగా రెండు రాబందులు గేదె మీద వాలి, పొడుచుకు తింటున్నాయి.
'బుడ్డ పొట్ట కోసమే ఏ ప్రాణమైనా పోరాడేది' అనుకున్నాడు. ప్రాజెక్టు ప్రధాన కాలువలో వెంకయ్య రోజూ గేదెలు మేపుతుంటాడు. కాలువలో మూడొంతులు ఇసుక, మట్టి దిబ్బలయితే ఒక వంతు మూలగా నీరు ప్రవహిస్తుంటుంది. దిబ్బ మీద నాయుడుగారి నిమ్మతోట ఉంది. ఆయనకున్న గేదెల ఫారంలో చచ్చిపోయిన గేదెల్ని నిమ్మతోటలోంచి కాలువ డొంకలో పారేస్తారు. వాటికోసం రెండు రాబందులు అక్కడకు వస్తుంటాయి. వాటి పక్క నుండి గేదెలు, మనుషులు వెళుతున్నా తమకేదో ముప్పు ఉందన్న భయాన్ని అవి మర్చిపోయాయి. ఈరోజు వాటికి ఆహారం దొరికిందని వెంకయ్య సంతోషించాడు. తన గేదెల కోసం కాలువలోకి చూశాడు. నీళ్ళలో పీకల దాకా మునిగి కళ్ళు మూసుకున్నాయి.తపస్సు చేసుకుంటున్న ఋషుల్లా ఉన్నాయవి.
ఊళ్ళో ఎవరు చనిపోయినా ఈ కాలువలోకి తీసుకొచ్చి కాలుస్తారు. చిన్నప్పటి నుండి వెంకయ్యకి ఈ కాలువకు ఇంటికి-మనిషికి ఉన్న బంధమే. పొద్దుపోయాకా గేదెల్ని కాలువలో నుండి పైకి తోలి, పొలంలో కట్టేసి, పాలు పితుక్కుని ఇంటికెళ్ళాడు.
కాళ్ళు కడుక్కుని ఇంట్లోకెళుతుండగానే కొడుకు దగ్గుతున్న శబ్దం వినబడింది. మూడు రోజులుగా ఏవేవో మందులు తెచ్చుకుని వాడుతున్నాడు. గుణం కనిపించట్లేదు. జ్వరమైతే తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తుంది.
'ఏవైనా కొంచెం నయమైనట్టుందా లచ్చమ్మా?' అని భార్యనడిగాడు.
'లేదయ్యా! జ్వరం తగ్గింది కానీ రొంప, దగ్గు అలాగే ఉన్నాయి. ఎందుకైనా మంచిదని కోడల్ని ఆళ్ళ పుట్టింటికి పంపేశాను అంది నీరసంగా లచ్చమ్మ.
ఆ రోజు అర్ధరాత్రి నుండి కొడుక్కి విపరీతమైన జ్వరం. కళ్ కళ్ మని ఎదురొమ్ములు ఎగిరిపడేలా అతడు దగ్గుతుంటే తెల్లార్లు నిద్రపోకుండా జాగారం చేశారు వెంకయ్య, లచ్చమ్మ. తలుపుకు వేలాడుతున్న పొట్లుపోయిన రంగుల్ని చూస్తూ ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తున్నాడు వెంకయ్య.
కొడుకు ప్రైవేటు టీచర్. వరి అన్నంలా తెల్లగా ఉంటాడు. ఎండలో కాసేపు కదలాడితే కందిపోతాడు. తన పనేదో తను చూసుకునే రకం. ఊళ్ళో ఉండే అల్లరి మూకలతో కలవడు. కరోనా వల్ల బడులు మూసేశాక సంవత్సరం నుండి ఖాళీగానే ఉంటున్నాడు. పెళ్ళయి ఆరు నెలలయ్యింది. ఊర్లో మంచోడని పేరెల్లిపోయాడు. అలాంటి కొడుకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వెంకయ్య నీళ్ళతో తడిసిన కాంక్రీటు స్తంభంలా మారిపోయాడు.
పొద్దెక్కాక బామ్మర్ది కోటేషును తీసుకుని, కొడుకును హాస్పటల్ కు తీసుకెళ్ళాడు వెంకయ్య. బెడ్లు ఖాళీ లేవు అని బయటకు పంపించేశారు. ఏం చేయాలో పాలుపోక ఆసుపత్రి ముందు నుంచుంటే.. అంబులెన్సులో తీసుకొచ్చిన పేషంట్ల తాలూకు మనుషుల జాలిగొలిపే ఏడుపులు వినబడుతున్నాయి. కోటేషు తనకు తెలిసిన ఆర్ ఎమ్ పి డాక్టరుతో ఫోన్లో మాట్లాడాడు. అతనొచ్చి ఆసుపత్రిలోకెళ్ళి మాట్లాడి, వాళ్ళ దగ్గరికొచ్చాడు.
'ఆరోగ్యశ్రీలో అయితే బెడ్లు ఇవ్వనంటున్నారు. మూడు లక్షలు కడితే జాయిన్ చేసుకుంటానన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీరియస్ అయిన పేషంట్లకు ఇదే రేటు. ముసలోడు కాదుగా! వయస్సులో ఉన్న కుర్రాడేగా! ప్రాణమంటూ ఉండాలేగానీ ఎంతైనా సంపాదించుకుంటాడు. ఆలోచించకండి!' అన్నాడు.
అంబులెన్సులో తీసుకొచ్చిన పేషెంటును బెడ్లు లేవని ఆసుపత్రి స్టాఫ్ వెనక్కు పంపేశారు. రాత్రి టి.వి లో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా సోకినవారు చనిపోతున్నారని చూసిన దృశ్యాలు వెంకయ్యకు కళ్ళ ముందు కదులుతున్నాయి. కీడెంచి మేలెంచమన్నారు. వాడికేమైనా అయితే కోడలు గతేంగానూ? అనుకుని వేరే ఆలోచన లేకుండా సరేనని, హాస్పటల్లో జాయిన్ చేసి ఊరికెళ్ళాడు. ధాన్యం షావుకారు దగ్గరికెళ్ళాడు. వెంకయ్యకు ఎకరం పొలం ఉండేది.
అందులోంచి ఆర్ అండ్ బి రోడ్డు వేయగా.. అరవై సెంట్ల భూమి పోగా, మిగిలిన నలభై సెంట్లలో వరి సాగు చేసుకుంటున్నాడు. వెంకయ్య తండ్రి భూమి కోల్పోయిన మనోవేదనతో మంచం పట్టి, కాలం చేశాడు.
చేను కోత కోసి, ధాన్యం కల్లంలో ఉన్నాయి. ఎప్పుడూ వాటిని కొనే షావుకారు దగ్గర ముందుగానే డబ్బులడిగాడు.
'వెంకయ్యా! ఈ సారి ధాన్యం అమ్మకాలు కష్టంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు విషయంలో ఉలుకూ పలుకూ లేదు. తుపానులు రెండు మూడు ఉన్నాయంటున్నారు. మిల్లుకు పంపిన రెండు లారీ లోళ్ళు ధాన్యంలో నూక ఎక్కువ ఉందని మిల్లర్లు రేటు తగ్గించేశారు. అయినా తెలిసిన మనిషివి కాబట్టి మిల్లర్లు పెట్టిన రేటుకు నీకు డబ్బులిస్తాను' అన్నాడు షావుకారు.
అదే ప్రసాదంగా భావించి, వెంకయ్య డబ్బులు తెచ్చుకున్నాడు. మిగిలిన డబ్బులకు లచ్చమ్మ బంగారం అడిగాడు. లచ్చమ్మకు పెళ్ళయ్యేసరికి ఇరవై కాసుల బంగారం ఉంది. అత్తమామల మరణాలు, వ్యవసాయం పేరు చెప్పి చివరికి మూడు కాసులు మిగిలింది. వాటిని తాకట్టు పెట్టి, వెంకయ్య డబ్బులు తెచ్చాడు. మిగిలిన డబ్బుకు ఊళ్ళో తెలిసినోళ్ళ దగ్గర నోట్లు రాశాడు. పూడిన రెండు లక్షలు హాస్పటల్లో కట్టాడు. ఆ రోజు నర్సు రెండు ఇంజక్షన్లు చేసింది. వైద్యానికి ఒళ్ళప్పగించిన కొడుకు తేరుకున్నాడనిపించింది. జ్వరం తగ్గింది, దగ్గు రావడం లేదు.
వెంకయ్యకు ఆసుపత్రి నిండా ఉన్న రోగుల సంబంధీకుల జీవితాలన్నీ ఒకేలా కనబడుతున్నాయి. ఎవరూ మాస్కు తీయడం లేదు. అక్కడంతా ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవట్లేదు. ఎదుటివాళ్ళ మీద కంటే ఎవరి మీద వాళ్ళకే సానుభూతి. ఇంత పెద్ద ప్రపంచంలో పక్కోడి యాతనను పెద్ద సమస్యగా ఎవ్వరూ తీసుకోవడం లేదు.
తరువాతి రోజు హాస్పటల్ మేనేజర్ గారు పిలుస్తున్నారని నర్సు చెప్తే ఆయన దగ్గరికెళ్ళాడు వెంకయ్య.
'మీ అబ్బాయికి ఆరు ఇంజక్షన్లు చేయాలి. హాస్పటల్లో ఉన్న రెండూ మీకే చేశాం. ఇంకో నాలుగు వేరే హాస్పటల్ నుండి మీరే తెచ్చుకోవాలి. వాటిని ''రెమిడిసివిర్'' ఇంజక్షన్లు అంటారు. అవి బ్లాకులో అమ్ముతున్నారు. అవైనా రికమండేషన్ ఉంటేనే ఇస్తున్నారు. నాలుగు ఇంజక్షన్లకు లక్షరూపాయల దాకా అవుతాయి. అవి చేస్తే మీ వాడు కరోనా నుండి బయటపడతాడు' అని మేనేజర్ నిర్మొహమాటంగా చెప్పేసరికి, వెంకయ్య తలూపి బయటకొచ్చేశాడు.
కోటేషును హాస్పటల్లో ఉంచి, వెంకయ్య ఇంటికెళ్ళి, పెట్టెలో ఉన్న కాగితాలు తీసుకున్నాడు. వాటిని తాకట్టు పెట్టి, లక్ష రూపాయలు పట్టుకుని, హాస్పటల్ కొచ్చాడు. వాళ్ళిచ్చిన అడ్రస్ పట్టుకుని వేరే హాస్పటల్‌కు వెళ్ళాడు.
వాళ్ళు మధ్యాహ్నం దాకా కూర్చోబెట్టారు. ముందుగా రెండు ఇంజక్షన్లకు యాభైవేలు తీసుకున్నారు. వెంకయ్యను ధర్మాకోల్‌తో చేసిన బాక్సును ఐస్‌తో నింపి తీసుకురమ్మన్నారు. వెంకయ్య షాపులన్నీ తిరిగి అవి సేకరించుకుని వచ్చాడు. ల్యాబ్ టెక్నీషియన్ పెద్ద సిరంజి తీసి, బాటిల్‌లోని ఇంజక్షన్‌ను దానిలోకి లాగాడు. రెండు ఇంజక్షన్లను అలా తీస్తున్నప్పుడు వెంకయ్య అపనమ్మకంగా చూస్తూనే ఉన్నాడు. నిన్న హాస్పటల్‌లో నర్సు చేసిన ఇంజక్షన్లలో చిక్కదనం వీటిలో లేదు. రోజూ గేదెల పాలను స్వయంగా పితికే వెంకయ్యకు చిక్కని పాలకు, నీళ్ళ పాలకు తేడా గుర్తించడంలో ఉన్న జ్ఞానం ఇక్కడ అక్కరకు వచ్చింది. 'ఇంజక్షన్ల కంపెనీ మార్పేమో!' అని వెంకయ్య పైకి ఏమీ మాట్లాడలేదు.
ల్యాబ్ టెక్నీషియన్ వెంకయ్యతో కొవ్వొత్తి తెప్పించి, సిరంజి సూదితో కొవ్వొత్తిని తూట్లు పొడిచాడు. సూదిలోకి మైనం చేరిందన్న రూఢి కుదిరాక, దానికి మూత తొడిగి సిరంజికి పెట్టి.. ఐస్ గడ్డల మధ్య ఉంచాడు. 'మీరు బండి మీద వెళ్తున్నప్పుడు కుదుపుకు సిరంజిలోని మందు బయటకు రాకుండా ఈ ఏర్పాటు చేశాను' అన్నాడు.
వెంకయ్యకు ఆ పెట్టె తీసుకెళుతున్నప్పుడు దారి పొడవునా రెక్కలు కొట్టుకుంటున్న రెండు రాబందులున్న పంజరాన్ని మోసుకెళుతున్నట్లు అనిపించింది. వాటిని తీసుకొచ్చి, కొడుకు దగ్గరున్న నర్సుకి ఇచ్చాడు.
వెంకయ్య వెళ్ళిపోయాక ల్యాబ్ టెక్నీషియన్ ఇంకొకరితో 'అతనికి అనుమానం వచ్చినట్టుంది!' అన్నాడు.
ఇంకొకతను 'పల్లెటూరి మనిషిలా ఉన్నాడు. అతనికి అర్థమవదులే కంగారుపడకు. అయినా మనమేం చేస్తాం? రెమిడిసివిర్‌కు ఉన్న డిమాండ్ అలాంటిది. ఇక్కడ ఇంజక్షన్‌కు పాతిక వేలకు బేరం కుదిరాక ఇంకోచోట నుండి 40,000కు ఆఫర్ వచ్చింది'. ఆ మాటలు ఆ నాలుగు గోడల మధ్య మిగిలిపోయాయి.
***
వెంకయ్యను కొడుకున్న గదిలోకి వెళ్ళనీయడం లేదు. వరండాలోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ అవసరమైతే నర్సు పిలుస్తుంది. వెంకయ్య పూర్తిగా హాస్పటల్లో ఉండిపోవడంతో కోటేషు సాయంత్రం పూటెళ్ళి పచ్చగడ్డి మోపులు కోసి, గేదెలకేసి పాలు తీస్తున్నాడు. వెంకయ్యకు ఆసుపత్రి నిండా కులాసాగా లేని మనుషులే కనబడుతుంటే నడవ బుద్ధవక గదిలోకెళ్ళి కూర్చుంటున్నాడు. ఇదివరకట్లా హాస్పటల్‌లో 'నయం చేయండి, మీకు పుణ్యముంటుంది' అనే మాటల్లేవు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ డబ్బు గురించే. బేరాల్లేని మాటలు. ఏదో ప్యాక్ అంటున్నారు. 'డబ్బుండడం మాత్రమే భూమ్మీద బతకడానికి అర్హతగా దాదాపు మనుషులందరం ఒప్పుకున్నాక ఎవర్ని ఎవరని ఏం లాభం?!' అనుకున్నాడు.
పొలాల వెంట పచ్చిగాలిని పీల్చిన వెంకయ్యకు నాలుగ్గోడల మధ్య మాస్కు పెట్టుకుని ఉంటే, ఊపిరాడడం లేదు. ఎవర్నైనా తెలీక ఒకటి రెండు సార్లు ఏదైనా అడిగితే చిరాకుపడిపోతున్నారు. అందుకే నోరు కూడా మెదపడం లేదు.
వ్యవసాయం చేస్తుండడం వల్ల సహనం దేహం నిండా పేరుకుపోయింది. అందుకే వెంకయ్యకు ఎవరి మీదా అంత తేలిగ్గా కోపం రాదు.
మర్నాడు పొద్దుటే కొడుక్కి జ్వరం వచ్చింది. దగ్గు పుంజుకుంది. వెంకయ్య పరిస్థితి రోట్లో నలుగుతున్న వడ్లగింజలా ఉంది. ఇంకో రెండు ఇంజక్షన్ల కోసం వేరే హాస్పటల్‌కు వెళ్ళాడు. బాటిళ్ళ నుండి రెండు సిరంజీల్లోకి లిక్విడ్ లాగుతున్నప్పుడు మరోసారి గమనించాడు. నిన్నటి ద్రవంలానే పలచగానే ఉంది. అనవసరంగా వాళ్ళను నిన్న అనుమానించాను. నేనే పొరబడ్డాను అనుకున్నాడు. డబ్బులు చెల్లించి, వేగంగా కొడుకు దగ్గరకు ఆ ఇంజక్షన్లు చేర్చాడు.
ఆ మధ్యాహ్నం చచ్చే ఉక్కబోత పోస్తుంది. ఒళ్ళంతా పొయ్యి మీద పెట్టి మరగకాస్తున్నట్టుంది.
'వానొస్తుందేమో!' అనుకున్నాడు.
'కోత కోసిన వడ్లు మడిలోనే ఉన్నాయి. తడిచిపోతాయి! మొలకొస్తే కొనే షావుకారు ఇంకా రేటు తగ్గిస్తానంటాడు ఏమో! అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడులే!' అని తనకు తాను సర్దిచెప్పుకున్నాడు.
కాసేపటికి భోజనం పట్టుకొచ్చిన కోటేషు 'బావా...అక్క తెగ ఏడుస్తుంది. పిల్లోడి మీద బెంగెట్టేసుకుంది' అన్నాడు. తనలో తానే ఆలోచించుకుంటూ నిలువుగా తలూపాడు వెంకయ్య.
అన్నం తిన్నాక కొడుకు దగ్గరికెళ్ళి చూసొచ్చాడు. కొడుకు సోయలో లేడు. ఒళ్ళు కాలుతూనే ఉంది. ఊపిరి తీసుకోలేక రొప్పుతున్నాడు.
నర్సును అడిగితే 'కంగారు పడితే ఎలా? తగ్గుతుంది లెండి' అంది.
సాయంత్రం అవుతుందనగా హాస్పటల్ మేనేజర్ పిలిచి, వెంకయ్యకు తన కొడుకు చనిపోయాడని, బ్యాగులో పెట్టి శవాన్ని అప్పగిస్తామని, అంబులెన్స్ తెచ్చుకోమన్నారు. వెంకయ్య తుపాను వచ్చి, కూలిపోయిన ఇంటి కప్పులా అయిపోయాడు. నుంచునే ఓపిక లేదు. కూర్చుంటే మతిస్థిమితంగా ఉండడం లేదు. ఒంట్లో రక్తమంతా కదలకుండా నిలిచిపోయినట్టుంది. కన్నీరు ధారగా కారిపోతున్నా అతడు తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. కోటేషు వెంకయ్యను అడగకుండానే అంబులెన్సు మాట్లాడుకొచ్చాడు.
అంబులెన్సు శవంతో ఊరివేపుగా వెళుతుంది. కోటేషు వెంకయ్యను అడిగాడు.
'బావా.. ఊళ్ళోకి కరోనా శవాన్ని తీసుకెళ్ళకూడదు. డైరెక్టుగా కాలువ కాడికి తీసుకెళ్దాం. ఆఖరి చూపుకు అక్కను కూడా పిలవొద్దు. బి.పి, షుగర్ ఉన్న మనిషి కదా! అమ్మాయేమో కడుపుతో ఉంది' అన్నాడు.
వెంకయ్య అలాగేనని తలూపాడు.
వర్షం కుండపోతగా కురుస్తుంది. అంబులెన్సు డ్రైవరు కోటేషుతో మాట కలిపాడు. 'హాస్పటల్‌కు ఎంత కట్టారు? ఎన్ని ఇంజక్షన్లు చేశారు?' ప్రశ్నలేసి మొత్తం వివరాలన్నీ తెలుసుకుంటున్నాడు.
కాసేపాగి అంబులెన్సు డ్రైవరే అన్నాడు.
'దోచుకోవడానికి ఇదే మంచి టైమండి. అంతా మోసాలేనండి. కరోనా వ్యాక్సిన్ల పేరు చెప్పి టిటి ఇంజక్షన్లు వేస్తున్నారట! రెమిడిసివిర్ ఇంజక్షన్లు అని బాటిళ్ళలో నీళ్ళు నింపుతున్నారట.. మనిషి ఆశకు అంతం లేదు. డబ్బు కోసం దిగజారిపోతున్నారు.'
వెంకయ్యకు వెన్ను నిటారుగా లేచింది. అయినా అంతా అయిపోయాక ఇక మాటలెందుకు అని మౌనంగా ఉన్నాడు.
ఏది వాస్తవమో తెలుసుకోకుండా ఆత్రంతో ఎగబడే వెర్రి బతుకుల్ని సృష్టించిన ఇంత గొప్ప వ్యాపార వ్యవస్థను, నిస్సహాయతలోకి నెట్టేసిన సమయాన్ని తలచుకున్నాడు. మోసం పూసే చెట్టు అయిన మనిషిని అసహ్యించుకున్నాడు. వాన తగ్గు ముఖం పట్టింది. కాలువ సమీపిస్తుండగా తన పొలంలో వరి ధాన్యాన్ని చూశాడు. వడ్లరాశిపై కప్పిన బరకాలన్నీ గాలికి లేచి, వడ్లన్నీ వాననీళ్ళలో నానిపోతున్నాయి. ''హూ...'' అనే ధ్వని వెంకయ్య నోటి నుండి వచ్చింది. అంబులెన్సు కాలువ గట్టుపై ఆగాక శవాన్ని భుజానేసుకుని, మోస్తూ కాలువ దోవలోకి నడిచాడు వెంకయ్య. నీటి తుంపర్లు ముఖం మీద కొడుతున్నాయి. దారంతా జారుడు మట్టి. ఎక్కడ కాలేసినా జారుతుంది.
ఇసుక దిబ్బ మీద శవాన్ని పడుకోబెట్టి.. ఏం పాలు పోక దాని పక్కనే కూర్చున్నాడు. లచ్చమ్మకు చూపించకుండా కొడుకును దహనం చేయడానికి తనకి మనసొప్పడం లేదు. బిడ్డ మీద తల్లికే హక్కు ఎక్కువుంటుంది. కానీ తప్పడం లేదు. లచ్చమ్మది పీలగుండె. కోడలేమో వట్టి మనిషి కూడా కాదు, నీళ్ళోసుకుంది అనుకున్నాడు. దూరంగా తన తండ్రి చావుకు కారణమైన రోడ్డు కనబడింది. ఎప్పుడు ఆ రోడ్డును చూసినా ఎవరో వీపు మీద చరిచినట్టుగా ఉంటుంది. రోడ్డు పక్కన వంతెన కొండచిలువ విడిచిన కుబుసంలా ఉంది. తన కొడుకును చంపిన హాస్పటల్, తన తండ్రిని దూరం చేసిన రోడ్డు చిన్నచేపల్ని మింగేసి, బతుకుతున్న తిమింగలాల్లా అనిపిస్తున్నాయి. తన జీవితాన్ని తానే వేలం వేసుకున్నట్టనిపిస్తుంది.
ఆకాశంలో మబ్బులు దిగంతాలకు ఉరుకుతున్నాయి. చిట్లిపోయిన జీవితాల రోదనను గాలి తన రొదలో కలిపేసుకుంది. ఈడ్చి కొడుతున్న గాలి నుండి తప్పించుకోవడానికి ఒక రాబందు ఇంకో రాబందు వెనుక నక్కింది. వానకు నిలువునా తడిచిపోయి ఉన్నాయవి. వాటికి ఈ రోజు ఆకలి తీరిందో లేదో అని వెంకయ్య ఆలోచించాడు.
అంబులెన్సు డ్రైవరుకి డబ్బులిచ్చి పంపించేసి, వెంకయ్య దగ్గరికొచ్చాడు కోటేషు.
'బావా.. ఆయుష్షు తీరిపోయింది. చిలక ఎగిరిపోయింది. శవాన్ని సాగనంపాలి. తాయితీగా కూర్చుంటే ఎలాగా? మన ఆచారం ప్రకారం శవాన్ని కాల్చడానికి పుల్లలు తేవాలి. ఊళ్ళోకెళ్ళి కాల్చేవాళ్ళను మాట్లాడుకుని రావాలి. వీటన్నిటికీ డబ్బులు వెతకాలి. ఇవన్నీ పురమాయించుకునేసరికి దీపాల వేళయిపోద్ది. మళ్ళీ చిన్నకార్యమొకటి చేయాలిగా! ఏదోటి తేల్చు' అని గడగడా మంచినీళ్ళు తాగినట్టు మాట్లాడేశాడు.
వెంకయ్య రెండు కళ్ళు ఎర్రబడి తడిబారాయి. చాలా మట్టుకు ఓపిక నశించింది. మొండిగా లేచాడు.
'ఛీఛీ! ఎదవ మనుషులు!! వీళ్ళ కంటే రాబందులే నయం!!! అవి చచ్చిపోయాకే పొడుచుకు తింటాయి. మనుషులు బతికుండగానే పీక్కుతింటారు' అంటూనే నాయుడు గారి నిమ్మతోట దారికెక్కాడు. కోటేషు వెంకయ్య వెళ్ళిన వేపే చూస్తున్నాడు. గునపం, పారతో తిరిగొచ్చిన వెంకయ్య నేలను తవ్వడం మొదలెట్టాడు.
'బహుశా' వేణుగోపాల్
9912395420