ప్రజాశక్తి-సీలేరు
ఆంధ్ర -ఒడిశా సరిహద్దుల్లో ఉన్న జడిగూడ, తరాబు జలపాతాలు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఎఒబిలోని మల్కన్‌గిరి జిల్లా, ఇటు పెదబయలు సరిహద్దుల్లో ఉన్న ఇవి చాలా అరుదైన జాలువారా జలపాతాలు. గలగల పారే సెలయేర్లు శబ్ధాలు, కిలకిలలాడే పక్షుల రాగాలు ఈ ప్రాంతాన్ని సందర్శించే వారికి ఎంతో అనుభూతిని కలిగిస్తున్నాయి. ఈ జల పాతాలకు చేరాలంటే సీలేరు నుంచి 40 కిలోమీటర్లు, పెదబయలు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. ఈ జలపాతాలకు వెళ్లే దారి పొడుగునా పచ్చటి చెట్లు, మంచు దుప్పట్లు అలముకుని ఉన్న కొండ, కోనలు, లోయలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్నాయి. వీటి సందర్శనకు పర్యాటకులు తరలివెళ్తున్నారు. ఈ సుందర దృశ్యాలను తిలకించి మంత్రముగ్ధులవుతున్నారు. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తూ సోషల్ మీడియాలో తమ బంధుమిత్రులతో పంచుకుంటున్నారు.
సరైన రహదారి లేక ఇబ్బందులు
ఈ జలపాతాలకు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. రహదారి అంతా పెద్ద పెద్ద రాళ్లతో ఉండడంతో ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తోందని పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో పర్యాటకులు విశ్రాంతి తీసుకొనేందుకు ఎటువంటి వసతులు కూడా లేవు. ఇప్పటికైనా అటు ఒడిశా, ఇటు ఆంధ్రా ప్రభుత్వాలు పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, రహదారి, వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.










