Aug 04,2021 18:01

న్యూఢిల్లీ : వరుసగా రెండు ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించినందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలుగు తేజం, భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు తెలిపింది. డిల్లీలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 'నేను పాల్గొన్న రెండు ఒలింపిక్స్‌లోనూ.. రెండు పతకాలు సాధించాను. మొదటి ఒలింపిక్స్‌కు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి పతకం గెలవడంతో.. ఈసారి నాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలతో నేనెంతో ఒత్తిడికి గురయ్యాను. ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నా.. చివరికి పతకం గెలిచినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ విజయం నేనెప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతం ఈ ఆనందంలోనే ఉన్నాను. వరుసగా పతకాలు సాధించడం చాలా గొప్ప విజయం. నేను సాధించిన ఈ పతకాలు.. మెరుగైన ఆట కనబరచాలనే ఇతరులకు ప్రేరణనిస్తాయనే అనుకుంటున్నాను. ఈ సందర్భంగా నా ఆటను గతంలో కంటే మెరుగుపరిచందుకు.. కొత్త కొత్త టెక్నిక్స్‌ నేర్పినందుకు నాకోచ్‌ పార్క్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్క ఒలింపిక్స్‌లోనే కాదు. డిసెంబర్‌లో స్పెయిన్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్నాను. అందులో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దాని కోసం మరికొన్ని రోజుల్లోనే సాధన మొదలుపెడతాను. అలాగే 2024లో ఒలింపిక్స్‌లో కూడా కచ్చితంగా ఆడతాను.' అని ఆమె అన్నారు.