మాస్కో : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం భేటీ కానున్నారు. రష్యాలోని అతి ముఖ్యమైన దేశీయ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వోస్టోచిని కాస్మోడ్రోమ్‌లో ఇరువురు నేతలు పర్యటిస్తున్నారు. ఇరువురు నేతలు సోయుజ్ -2 స్పేస్ రాకెట్ లాంచ్ ఫెసిలిటీ పర్యటనతో తమ సమావేశాన్ని ప్రారంభించినట్లు రష్యా అధికారిక మీడియా తెలిపింది. కాస్మోడ్రోమ్ పర్యటన అనంతరం ఇరువురు నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. ఆ సమయంలో కిమ్ రష్యా అంతరిక్ష అధికారిని రాకెట్ల గురించి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
సైనిక నిఘా ఉపగ్రహాల సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం కిమ్ రష్యా సాంకేతిక సహాయాన్ని కోరవచ్చని దక్షిణ కొరియా పేర్కొంది. ఈ పర్యటన ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకమైనదిగా పేర్కొంది. తన మొదటి సైనిక నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో ఉత్తర కొరియా పలుమార్లు విఫలమైంది. కిమ్‌తో పాటు ఉత్తర కొరియా అంతరిక్ష శాస్త్ర మరియు సాంకేతిక కమిటీ చైర్మన్ పాక్ థారు సాంగ్, నేవీ అడ్మిన్ కిమ్ మ్యోంగ్ సిక్ కూడా ఉన్నట్లు ఫోటోలు దర్శనమిచ్చాయని దక్షిణ కొరియా తెలిపింది. రష్యా సాంకేతిక సాయం, సైనిక భాగస్వామ్యంపై మీడియా ప్రశ్నలకు పుతిన్ మాట్లాడుతూ.. చర్చలు జరగనున్నాయని అన్నారు.
కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాలో పర్యటిస్తుండగా.. ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. జపాన్ సముద్ర జలాల దిశగా క్షిపణులు వెళ్లినట్లు వెల్లడించింది. అవి ఎంత దూరం ప్రయాణించాయో దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించలేదు. క్షిపణులు ఇప్పటికే ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని, వాటి భాగాలు సముద్రంలో పడే అవకాశం ఉందని జపాన్ కోస్ట్‌గార్డ్, రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకించింది.