చండీగఢ్ : పంజాబ్‌ను దోచుకునేందుకే ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చారని రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ మండిపడ్డారు. అందుకే తనపై అనేక తప్పుడు ఆరోపణలు చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. 'కేజ్రీవాల్.. అబద్దాలకోరు. పలు తప్పుడు ఆరోపణలతో నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు యత్నించారు. కానీ.. ఏదీ నిజం కాదు. ఆప్ నేతలు నాపై గవర్నర్‌కూ ఫిర్యాదు చేయగా.. ఆయన విచారణకు ఆదేశించారు. చివరకు సత్యమే గెలిచింది' అని చన్ని పేర్కొన్నారు. బ్రిటీష్ వారు భారత్‌ను కొల్లగొట్టేందుకు వచ్చినట్లు, కేజ్రీవాల్, అతని ఢిల్లీ కుటుంబసభ్యులు, బయటి వ్యక్తులు కూడా పంజాబ్‌ను దోచుకోవడానికి వచ్చారని ధ్వజమెత్తారు. అయితే.. మొఘలులు, బ్రిటీషర్ల విషయంలో స్పందించినట్లుగానే పంజాబ్ కూడా వారిని సరైన చోటుకే చేర్చుతుందని అన్నారు. ఇటీవల సిఎం సొంత నియోజకవర్గం చామ్‌కౌర్ సాహిబ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు గవర్నర్‌కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశించారు. అయితే ఆధారాలు లభ్యం కాలేదని స్థానిక డిప్యూటీ కమిషనర్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చన్నీ.. కాంగ్రెస్ సిఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు.










