Aug 06,2021 21:55
పులిచింతల వద్ద స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటు పనిలో సిబ్బంది
  • 36 టిఎంసిల నీరుగా సముద్రం పాలు
  • పులిచింతలలో 13.48 టిఎంసిలకు తగ్గిన నీటి నిల్వ

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పులిచింతల జలాశయంలో నీటి నిల్వను పది టిఎంసిలకు తగ్గించే, స్టాప్‌లాక్‌ గేటు అమర్చే ప్రయత్నాల్లో పులిచింతల ప్రాజెక్టు అధికారులు ఉన్నారు. స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటుకు నిపుణుల బృందం ఈ ప్రాజెక్టు వద్దకు శుక్రవారం చేరుకుంది. 16వ నంబరు గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటు అమర్చేందుకు భారీ క్రేన్లు తెప్పించి గేటు అమర్చే ప్రక్రియను ప్రారంభించారు. శనివారం నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఈ ప్రాజెక్టు ఎస్‌ఇ రమేష్‌బాబు తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రాజెక్టు గేటు ఊడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో గురువారం ఉదయం 44 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వస్తోన్న నీటితో కలిపి గత 36 గంటల వ్యవధిలో దాదాపు 36 టిఎసిల నీటిని వృథాగా దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. పులిచింతల జలాశయంలో శుక్రవారం మధ్యాహ్నానికి 13.48 లక్షల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి సాగర్‌కు 1.20 లక్షల క్యూసెక్కులు, సాగర్‌ నుంచి పులిచింతలకు 98 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 4,56,989 క్యూసెక్కుల నీరు వస్తుండగా 12,349 క్యూసెక్కులు తూర్పు, పశ్చిమ డెల్టా కాల్వలకు, 4,44,640 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో పసుపు, అరటి, కంద, కూరగాయలు తదితర పంటలు నీట మునిగాయి. కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు, రేపల్లే మండలాల్లోని పల్లపు ప్రాంతాల్లోని భూములు నీటి ముంపునకు గురయ్యాయి. ప్రకాశం బ్యారేజీకి శనివారం సాయంత్రం వరకు వరద కొనసాగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పులిచింతల నుండి విడుదలవుతున్న నీరు
పులిచింతల నుండి విడుదలవుతున్న నీరు