Aug 07,2021 20:10
  • కాంట్రాక్టర్‌పై ఇప్పుడు చర్యలు తీసుకోలేం
  • ప్రస్తుతం ప్రాజెక్టులో ఐదు టిఎంసిల నీరు
  • నేటి సాయంత్రానికి స్టాఫ్‌ లాగ్‌ గేటు పూర్తి

ప్రజాశక్తి-యంత్రాంగం : పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు ఊడిపోవడంతో స్టాప్‌ లాక్‌ గేటు ఏర్పాటు పనులు నిపుణుల కమిటీ పర్యవేక్షణలో చురుగ్గా సాగుతున్నాయి. ఈ గేటు ఏర్పాటుకు మొత్తం 11 తలుపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా శనివారం సాయంత్రానికి ఐదు మాత్రమే అమర్చగలిగారు. మిగిలిన ఆరింటినీ ఆదివారం ఏర్పాటు చేసి సాయంత్రానికి గేటు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీరు నారాయణరెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్లే గేటు ఊడిపోయిందని చెప్పారు. ప్రాజెక్టు పనులు పూర్తయి పదేళ్లు అవుతున్నందున కాంట్రాక్టర్లపై ఇప్పుడు చర్యలు తీసుకోలేమని తెలిపారు. గేటు ఏర్పాటు పూర్తయిన తరువాత పులిచింతల జలాశయంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని చెప్పారు. గేటు ఊడిపోవడంతో పులిచింతల జలాశయం ద్వారా గురువారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు దాదాపు 40 టిఎంసిల నీరు వృథాగా దిగువకుపోయిందని, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా ఈ నీరంతా సముద్రం పాలైందని అధికారులు అంచనా వేశారు. పులిచింతల జలాశయం గరిష్ట నీటిమట్టం 45.77 టిఎంసిలు కాగా, శనివారం సాయంత్రానికి ఐదు టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువ నుంచి 44,511 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తుండగా 600 క్యూసెక్కులను మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ఉధృతి తగ్గడంతో జలాశయం నుంచి నీటి విడుదలను గణనీయంగా తగ్గించారు. దీంతో, ప్రకాశం బ్యారేజీకి నీటి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 66 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 52 వేల క్యూసెక్కులు ఉంది. బ్యారేజీ 70 గేట్లను అడుగు మేర పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు బ్యారేజీ జెఇ దినేష్‌ తెలిపారు. కాలువలకు మరో 13,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు.

కొట్టుకుపోయిన గేటు శకలాలు
కొట్టుకుపోయిన గేటు శకలాలు


750 మీటర్ల దూరంలో గేటు శకలాలు లభ్యం
కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు ఆచూకీ లభ్యమైంది. ప్రాజెక్టు దిగువ 750 మీటర్ల దూరంలో ఈ గేటు ఆనవాళ్లను చేపలు పడుతున్న మత్స్యకారులు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. ఈ గేటు భారీ బరువు ఉన్నా ఒకేసారి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీటి ఉధృతిలో అంతదూరం కొట్టుకుపోయింది. ఈ గేటు శకలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.