Aug 06,2021 13:24

గుంటూరు : పులిచింతల ప్రాజెక్టు 16 వ గేటు వద్ద విరిగిన ప్రాంతంలో స్టాప్‌ లాక్‌ ఏర్పాటుకు నిపుణుల ఆధ్వర్యంలో నీటిపారుదలశాఖ అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. సాగర్‌, తుపాకులగూడెం, పోలవరం నుంచి నిపుణులు వచ్చారు. 35 మంది సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగమయ్యారు.
      పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయిన సంగతి తెలిసిందే. రెండు అడుగుల మేర గేట్లను ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్‌ గడ్డర్‌ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే ప్రాజెక్టు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ నిన్న ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిపుణుల బృందాన్ని రప్పించి మరమ్మతులను ప్రారంభించారు.
      జలాశయంలోని వరద నీటిని దిగువకు వదిలి నీటిమట్టాన్ని తగ్గించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం పులిచింతల జలాశయంలో 20 టిఎంసి ల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి లక్షా 67 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. 19 గేట్లను ఎత్తి 4.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విరిగిన గేటు మరమ్మతు పనులను ప్రారంభించాలంటే జలాశయంలో మరో 10 టిఎంసి లు ఖాళీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తికావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు స్టాప్‌ లాక్‌ ఏర్పాటుకు సంబంధించిన నిపుణుల బఅందం పులిచింతల ప్రాజెక్టు వద్ద తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.