ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ లో మంగళవారం జరిగిన శిశువు మరణంపై విచారణ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతూ ఐద్వా, డి.వై.యఫ్.ఐ విజయవాడ నగర కమిటీల ఆధ్వర్యంలో హాస్పిటల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఐద్వా జిల్లా కార్యదర్శి కె. శ్రీదేవి, ఐద్వా, డి.వై.యఫ్.ఐ సెంట్రల్ కార్యదర్శులైన జి.ఝాన్సీ, యస్.కె. నిజాం మాట్లాడుతూ డాక్టర్లు అందుబాటులో లేక బాబు మరణించడం బాధాకరమైన విషయమని, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయని, ఇంతకుముందు బాబు మిస్సింగ్ ఘటన ఇటువంటి అనేక సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని అలాగే హాస్పిటల్ లో అరకొర సౌకర్యాలు తో గర్భిణీ స్త్రీలు, బాలింతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఒక బెడ్ పై ఇద్దరు ముగ్గురును ఉంచుతున్నారని, కొంతమందిని నేలపై పడుకోబెడుతున్నారని, ఎక్సరే, స్కానింగ్ ల వద్ద గర్భిణీ స్త్రీలు నిలబడలేక కళ్ళు తిరిగి పడిపోయిన ఘటన లు అనేకం జరిగాయని , వాళ్ళు కూర్చుంటానికి బల్లలు, ఫ్యాన్లు కూడా లేవని, పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుందని, మెడిసిన్ అన్ని అందుబాటులో లేవని అడుగడుగునా అనేక సమస్యలు ఉన్నాయని, చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి, సిటీ నుంచి వందల సంఖ్యలో గర్భిణీ స్త్రీలు వస్తారని వారికి తగిన సదుపాయాలు కానీ తగినంత సిబ్బంది కానీ లేరని అన్నారు. నిర్మాణ దశలోనే ఆగిపోయిన ఆసుపత్రికి నిధులు కేటాయించి వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చి , సిబ్బంది ని కేటాయిస్తే కొంతవరకూ సమస్య పరిష్కారమౌతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో U.శివ, స్వప్న, ఆష, వెంకటరత్నం, అమ్ములు , పిచ్చమ్మ,అరుణ, సావిత్రి పాల్గొన్నారు.










