Aug 04,2021 17:52

అతని వయసు 83 ఏళ్లు. 27 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. జైల్లో సచ్ఛీలుడిగా పేరు సంపాదించుకున్నాడు. మలి వయసులో జైలు జీవితంపై విరక్తి చెంది క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నారు. సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి.. ఏదో చిన్నాచితకా నేరం చేశారనుకోకండి. అతను చేసిన నేరమేంటో తెలిస్తే అందరూ షాక్‌కి గురవ్వాల్సిందే.
బాబాగా గుర్తింపు సంపాదించుకున్న స్వామీ శ్రద్ధానంద అలియాస్‌ మురళీ మనోహర్‌ మిశ్రా 1986లో షకిరే అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె మైసూర్‌ రాష్ట్ర మాజీ దివాన్‌ సర్‌ మిర్జా ఇస్మాయిల్‌ మనవరాలు. రూ.600 కోట్ల ఆస్తికి వారసురాలు. షకిరే శ్రద్ధానందను వివాహం చేసుకోక ముందు.. అప్పటికే తనకి వివాహమై ఓ కుమార్తెకి తల్లి కూడా అయింది. తన భర్తకు విడాకులిచ్చి మరీ షకిరా శ్రద్ధానందను 1986లో వివాహమాడింది. వివాహమైన తర్వాత 1991 మే నుంచి ఆమె అనూహ్యంగా అదృశ్యమైంది. తల్లి కనిపించకపోవడంతో.. షకీరా కుమార్తె, తల్లి ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు శ్రద్ధానందను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు మూడేళ్లపాటు దర్యాప్తు జరిగింది. చివరికి శ్రద్ధానందనే నిందితునిగా పోలీసులు గుర్తించారు.
షికిరెకున్న 600 కోట్ల ఆస్తి కోసమే..కాఫీలో మత్తమందు కలిపి ఇచ్చి ఆమె బతికుండగానే ఇంటి పెరట్లో గొయ్యితీసి పూడ్చేసినట్టు శ్రద్ధానంద కోర్టు ముందు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు 1994లో అతనికి బతికి ఉన్నంతవరకు జైలు శిక్ష విధించింది. దీంతో అతను 27 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. చివరకు 83 ఏళ్ల వయసులో బయటకు రావాలని కోరుకుంటున్నాడు. ఈ మేరకు అతను 27 ఏళ్లుగా జైలులో తన సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని తనని విడుదల చేయాలని రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకున్నాడు.
.