Jan 20,2023 15:11

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి జిల్లాలో ఈనెల 22 వ తేదీ ఆదివారం  జరుగనున్న కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక వ్రాత పరీక్షల నేపథ్యంలో తీసుకున్న  బద్రతా చర్యలు నియమ నిబందనల పై తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి ఐపీఎస్., వెల్లడించారు.  తిరుపతి నగరం నందు 37 పరీక్షా కేంద్రాలలో 20,602 మంది, పుత్తూరు నందు 13 పరీక్షా కేంద్రాలలో 6,444 మంది, గూడూరు నందు 7 పరీక్షా కేంద్రాలలో 4,542 మంది అభ్యర్థులు  జిల్లా వ్యాప్తంగా మొత్తం 57 పరీక్షా కేంద్రాలు తిరుపతి జిల్లాకు చెందిన మొత్తం 31,588 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. తిరుపతి, పుత్తూరు, గూడూరు నందు గల స్ట్రాంగు రూంలు పరీక్షా కేంద్రాల వద్ద సుమారు 700 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తుతో పాటు సిసి కెమెరాలను ఏర్పాటు చేసి  కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.  పరీక్షా కేంద్రాల దగ్గర 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉంటున్నందున, ఎవ్వరూ గుంపులుగా ఉండకూడదన్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలకు దగ్గరలో గల జెరాక్స్ షాపులను మూసి వేయడంతో పాటు వైఫై సేవలను కూడా నిలిపివేస్తున్నమన్నారు. 100 మీటర్ల పరిధి వరకు ఎటువంటి వాహనాలను పార్కింగ్ చేయరాదు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు ఒక గుర్తింపు కార్డు మరియు బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్నులు మాత్రమే తీసుకురావాలని మాల్ ప్రాక్టీస్,  కాఫీయింగ్ తదితర అక్రమాలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల బయట ఎలాంటి అక్రమాలకు తావులేకుండా తిరుపతి, గూడూరు, పుత్తూరు పరీక్షా కేంద్రాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో నిరంతర ఆకస్మిక తనిఖిల నిమిత్తం  ఫ్లైయింగ్ స్క్వాడ్ లు నియమించబడ్డాయి అని అన్నారు.