Jul 27,2021 12:04

ముంబయి : అశ్లీల చిత్రాల కేసుకు సంబంధించి నటి షెర్లి చోప్రాకు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రాపర్టీ సెల్‌ పోలీసుల నుండి సమన్లు అందాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు షెర్లి చోప్రా విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు సూచించారు. విచారణలో ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయనున్నారు. అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి విదితమే. రాజ్‌కుంద్రాతో పరిచయమున్న ప్రతీ ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఆ క్రమంలో నటి షెర్లి చోప్రాకు కూడా సమన్లు అందాయి. ఈ కేసుతో తనకు సంబంధమున్నట్లు దర్శకుడు తన్వీర్‌ హష్మి పోలీసులు ముందు ఒప్పుకున్నారు. తాము కలిసి 20-25 నిమిషాల నిడివితో ఓ షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసినట్లు తన్వీర్‌ హష్మి తెలిపారు.
      అనుమానితుల పేర్లలో ఉన్న నటి ఫ్లోరా సైని స్పందించారు. ఆమె మాట్లాడుతూ... తానెప్పుడూ రాజ్‌కుంద్రాను కలవలేదని చెప్పారు. తాను నటిగా పలు సినిమాల సన్నివేశాలలో నటించాను కానీ రాజ్‌కుంద్రాతో ఎలాంటి పరిచయమూ లేదన్నారు. అశ్లీల చిత్రాలకు తాను దూరంగా ఉంటానని, కొందరు వాట్సాప్‌లలో, ఛాటింగ్‌లలో తన పేరును ప్రస్తావించినంతమాత్రాన వారితోపాటు తాను కూడా కలిసి పనిచేసినట్లు కాదని చెప్పారు.
       ఇదిలా ఉండగా... పోలీసుల అదుపులో ఉన్న రాజ్‌కుంద్రాకు చెందిన బ్యాంక్‌ ఖాతాలన్నిటినీ ముంబయి పోలీసులు బ్లాక్‌ చేశారు. కాన్పూర్‌లోని ఎస్‌బిఐ శాఖలో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిలకు ఉన్న ఖాతాలను నిలిపివేయాలని అక్కడి బ్యాంకు యాజమాన్యానికి సూచించారు.