- గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించే లక్ష్యాలకు కట్టుబడాలి
వాటికన్ సిటీ : వాతావరణ మార్పులు నెమ్మదించే లక్ష్యాలకు కట్టుబడి వుండాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ నేతలను కోరారు. ఇంకా ఆలస్యం కాకుండా ఈ విషయంలో తొందరపడాల్సి వుందని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోని అత్యంత నిరుపేదలు, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వారు ఇప్పటికే ఈ వాతావరణ మార్పులకు అధిక మూల్యం చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. మానవాళికి, భూగోళానికి ఇప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కలిగిన నష్టాన్ని మనమెలాగూ పూడ్చలేం, కనీసం మరింత నష్టం వాటిల్లకుండా నిలువరించేందుకన్నా మనం ప్రయత్నించాల్సి వుందన్నారు. ప్రధానంగా అమెరికాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తలసరి కాలుష్య ఉద్గారాల విడుదల చైనాతో పోలిస్తే రెట్టింపుగా వుందని అన్నారు. అదే పేద దేశాల సగటుతో పోల్చుకుంటే ఏడు రెట్లు ఎక్కువగా వుందన్నారు. వ్యక్తిగత, కుటుంబాల స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు కొంతమేరకు దోహదపడుతున్నప్పటికీ, సుదీర్ఘకాలంలో గణనీయమైన ప్రభావాన్ని చూపగలిగే, పశ్చిమ దేశాల నమూనాతో ముడిపడిన బాధ్యతారాహిత్యమైన జీవనశైలిలో విస్తృతమైన మార్పులు తీసుకురావాల్సి వుందన్నారు. ప్రెయిజ్ గాడ్ పేరుతో ఒక డాక్యుమెంట్‌ను ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. దుబారులో తదుపరి దఫా ఐక్యరాజ్య సమితి చర్చలకు వాతావరణ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన కోరారు.