Nov 03,2023 13:31

ఢాకా :    మెరుగైన వేతనాల కోసం డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టిన గార్మెంట్‌ కార్మికులపై గురువారం పోలీసులు విరుచుకుపడ్డారు. కార్మికులను చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్‌, స్టన్‌ గ్రెనేడ్స్‌ను ప్రయోగించారు. దేశవ్యాప్త ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పోలీసు సహా ఆరుగురు మరణించగా, సుమారు 50 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మెరుగైన వేతనాల కోసం సుమారు వెయ్యికి పైగా గార్మెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులు గత ఆరురోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఢాకాతో పాటు, పారిశ్రామిక జిల్లా ఘాజిపూర్‌లో 300కు పైగా ఉన్న గార్మెంట్‌ ప్యాక్టరీల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, అద్దె, ఇతర బిల్లులతో వారి జీవనం భారంగా మారింది. దీంతో వేతనాన్ని పెంచాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవనం సవాలుగా మారింది.

కార్మికులకు నెలవారీ వేతనంగా కేవలం 8,300 టాకాలు లేదా 75 డాలర్లు చెల్లిస్తున్నారు. అయితే కుటుంబ ఖర్చుల కోసం తరచుగా ఓవర్‌ టైం పనిచేయాల్సి వస్తోందని బంగ్లాదేశ్‌ గార్మెంట్‌ తయారీ దారులు మరియు ఎగుమతి దారుల సంఘం (బిజిఎంఇఎ) పేర్కొంటున్నాయి. ఖర్చులు అధికమయ్యాయని, మీర్‌పూర్‌ వంటి మురికివాడలో ఇంటి అద్దెకోసమే సుమారు 900 టాకాలు (82 డాలర్లు) చెల్లించాల్సి వుందని ఓ మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక లీటర్‌ వంట నూనె ధర 180-190 టాకాలు (1.62 డాలర్లు) ఉంందని, ఇక మిగిలిన ఖర్చులు ఎలా భరించగలరు అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదని నిలదీశారు.    తాము కనీస వేతనంగా 208 డాలర్లు డిమాండ్‌ చేయగా, ప్రభుత్వం కేవలం 90 డాలర్లు (25 శాతం) పెంచాలని ప్రతిపాదించిందని బిజిఎంఇఎ పేర్కొంది. దీంతో మెరుగైన వేతనం కోసం గతవారం నుండి ఆందోళనకు దిగామని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన బ్రాండ్లను పశ్చిమ దేశాలు తక్కువ ధరకు అందిస్తుండటంతో ధరలు పతనమయ్యాయని ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంటోంది. అధిక ఇంధన ధరలు మరియు రవాణా ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి వ్యయం అధికమైందని వెల్లడించింది.

చైనా తరువాత సుమారు 3,500 ఫ్యాక్టరీలతో  దుస్తుల ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశంగా నిలిచిన బంగ్లాదేశ్‌లో  . సుమారు 40 లక్షల మంది కార్మికులు  పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు బిజిఎంఇఎ పేర్కొంది. జనవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఈ ఆందోళనలు మరింత రాజకీయ గందరగోళానికి దారితీయవచ్చని అధికార పార్టీ సహా పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.