Jul 31,2021 09:54

నెల్లూరు : కొంతమంది పోలీసులు ఫ్రెండ్లీ పోలిసింగ్‌ విధానాన్ని అవలంభిస్తున్నామంటూ.. ప్రజలతో స్నేహంగా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులకు షరతులతో కూడిన అధికారం ఇవ్వబడింది. కానీ కొంతమంది దీన్ని ఇష్టానుసారంగా వాడుతుంటారు. ఓ వ్యక్తి మాస్క్‌ లేకుండా ఎస్‌ఐ కంటపడ్డాడు. అంతే ఆ ఎస్‌ఐ సదరు వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన నెల్లూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
    నెల్లూరు జిల్లా చేజర్ల ఎస్‌ఐ మహ్మద్‌ హనీఫ్‌ అందూరుపల్లి సెంటర్‌లో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ వ్యక్తి నోటికి మాస్కు ధరించకుండా వెళుతుండటం ఎస్‌ఐ కంటపడింది. దీంతో ఆ ఎస్‌ఐ కోపోద్రేకంతో సదరు వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మాస్కు ఎందుకు పెట్టుకోలేదంటూ.. కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా చొక్కా పట్టుకుని కొడుతూనే కారులో తీసుకెళ్లాడు. ఈ ఘటనంతటినీ అక్కడే ఉన్న స్థానికుడు మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కేవలం మాస్కు లేదన్న కారణంగా ఇంతలా దండించాలా ? అంటూ నెటిజన్ల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఆ వ్యక్తి నిబంధనలను ఉల్లంఘించినా ఓ పోలీసు అధికారి స్పందించాల్సిన తీరు ఇది కాదంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ విధానం అంటే ఇదేనా అంటూ.. ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.