Polavaram Project : ప్రిజర్వ్ టన్నెల్స్ తవ్వకం ప్రారంభం.. పోలవరంలో జల విద్యుత్ కేంద్రం పనులు ముమ్మరం

* 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానున్నట్లు వెల్లడి
ప్రజాశక్తి-పోలవరం (పశ్చిమగోదావరి) : పోలవరం ప్రాజెక్టులో కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం ప్రిజర్వ్ టన్నెల్స్ తవ్వకం పనులను శుక్రవారం ప్రారంభించారు. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే 194 టిఎంసిల నీటిని నిల్వ చేస్తారని, అందులో 120 టిఎంసిల నీటిని జల విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాలకు విడుదల చేస్తారని తెలిపారు. మిగిలిన 70 టిఎంసిల నీటిని భవిష్యత్ అవసరాలకు నిల్వ చేస్తారని చెప్పారు. పోలవరం జలవిద్యుత్ కేంద్రం 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ సామర్ధ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో 12వెర్టికల్ కెప్లాన్ టర్బైన్లు ఉంటాయి, ఒక్కో టర్బైన్ 80 మెగావాట్ల కెపాసిటీ కలిగి ఉంటుంది.వీటిని భోపాల్‌కు చెందిన బిహెచ్‌ఈఎల్ సంస్థ రూపొందించింది. ఇవి ఆసియాలోనే అతిపెద్దవి. వీటికి సంబంధించి ఇప్పటికే మోడల్ టెస్టింగ్ కూడా పూరైంది. వీటికోసం 12 ప్రిజర్ టన్నెల్స్ తవ్వాల్సి ఉంటుంది. ఒక్కో టన్నెల్ 145 మీటర్ల పొడవున, తొమ్మిది మీటర్లు డయాతో తవ్వుతారు. వీటికి 12 జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్లు ఉంటాయి, ఒక్కోటి వంద మెగావాట్ల సామర్థ్యంతో ఉంటాయి. పవర్ ప్రాజెక్టు కోసం 206 మీటర్లు పొడవునా అప్రోచ్ ఛానెల్, 294 మీటర్లు వెడల్పు తవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి డ్రాయింగ్స్, మోడల్స్ రూపొందించే పనులు సైతం పూర్తి కావొచ్చాయి. కీలకమైన జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ రివర్స్ టెండరింగ్ తరువాత 2021 మార్చిలో పనులు ప్రారంభించింది. ఇప్పటికే 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులను పూర్తి చేసింది. పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులలో జలవనరుల శాఖ తవ్వకం పనులను పర్యవేక్షిస్తుండగా,కీలకమైన ప్రిజర్వ్ టన్నెల్స్ తవ్వకం పనులు, జలవిద్యుత్ కేంద్రానికి సంబందించిన మిగిలిన అన్నిపనులను జెన్‌కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు.