Jun 07,2021 08:54

చరిత్రకు
ఆధారమైన
వందేళ్ల నాటి
వస్తువులు అవి....

ఒకనాడు
ఐదేళ్లు నోట్లోకి
పోవాలంటే అవేట ఆదెరువు....

అరకను
గడ్డిపరకను
ఇంటిల్లిపాదిని
తండ్రిలా భుజనేసుకొని
లాలించిన బతుకుబండి అది..
కిరీటం లేని
మహారాజు
కీర్తి రథం అది...

సవారి తడకలేసి
సంసార జీవితాన్ని
జీవిత యాత్రను
జాతరగా జేసిన
బతుకు బండి అది.....

నేడు ప్రపంచీకరణ
సృష్టించిన పెనుప్రమాదంలో
ఆదెరువు గోల్పోయి
మూగజీవుల తోడు విడిచి
మ్యూజియంలో బందీ అయి
అనాథలా దర్శనమిస్తున్న
బతుకు బండి మన ఎడ్లబండి...

మూగనేలకు
భాషను....
మాగాణి మట్టికి
మానవత్వాన్ని నేర్పుటకై
అవనిపై
ఆకుపచ్చ సంతకం జేసే అరక....
నేడు
ఆదెరువు కరువై
అందరున్నా అనాథలా
అంగడిలో
అలంకరణ వస్తువైంది...
అన్నపూర్ణ దేవి చేతికలం హలం....

మట్టిని నమ్మిన రైతుచేతిలో
ఒకనాటి పనిముట్లు
నేడు అలంకరణ వస్తువులై
ఆర్తగీతం ఆలకిస్తున్న పనిముట్లు...

- ఉప్పరి తిరుమలేష్‌
96189 61384