Jul 24,2021 08:43

మనీలా : ఫిలిప్పీన్స్‌లో శనివారం వరుస భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. లూజాన్‌ ప్రధాన దీవిలో శనివారం తెల్లవారుజామున 4.48 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.0 గా నమోదైందని అధికారులు తెలిపారు. 112 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉందని అన్నారు. మరోసారి మనీలా నగరానికి దక్షిణాన బటాంగాస్‌ ప్రావిన్సులోని కాలాటాగన్‌ మున్సిపాలిటీలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.8గా నమోదైంది. భూకంపానికి తోడు వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని పోలీసు మేజర్‌ రోని చెప్పారు. ఫిలిప్పీన్స్‌ ద్వీపాలు రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ లో ఉండటంతో తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయని ఫిలిప్పీన్స్‌ సీస్మోలాజికల్‌ ఏజెన్సీ తెలిపింది. అయితే సునామీ హెచ్చరికలు లేవని  తెలిపింది.