Jul 02,2023 20:32

మాట్లాడుతున్న సర్పంచి తెల్లబండ్ల భీమయ్య

ప్రజాశక్తి - మంత్రాలయం
ఫ్యాషన్‌ డిజైన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు స్వతంత్ర జీవితంపై భరోసా కలుగుతుందని సర్పంచి తెల్లబండ్ల భీమయ్య తెలిపారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కర్కల ప్రాంతంలోని శ్రీనివాస్‌ సేవా ట్రస్టు (ఆర్‌) ఆధ్వర్యంలో సుమేధ ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వాహకులు సాధన జి.ఆశ్రిత్‌ నేతృత్వంలో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని పాత పాఠశాల గదిలో నాలుగు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫ్యాషన్‌ డిజైన్‌ నేర్చుకోవడం వల్ల విద్యార్థులు, మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తారని తెలిపారు. కుటుంబాలకు ఆసరాగా ఉంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సాదన జి.ఆశ్రిత్‌ మంత్రాలయం మహిళలకు ఇలాంటి అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. అభివృద్ధి చెందుతున్న పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శిక్షణ పొందిన మహిళలకు ఆదాయ ఆర్జన సులభతరం అవుతుందని తెలిపారు. ఇప్పటికే మహిళలు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి నైపుణ్యం వల్ల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నిఘా పత్రిక జిల్లా స్టాఫర్‌ వడ్డే విజరు కుమార్‌ సహకారం వల్ల ఇక్కడ శిక్షణ కార్యక్రమం జరగడం అభినందనీయమన్నారు. ఈ విషయం గ్రామంలో ఇంకా చాలామంది విద్యార్థులకు, మహిళలకు తెలియదని తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా, దండోరాతో ప్రచారం నిర్వహిస్తామని, దీని వల్ల మరింత మంది విద్యార్థులకు, మహిళలకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. మహిళల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలే కాక సమాజానికి ఉపయోగపడే ఎలాంటి పనికైనా రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాలతో సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
ఫ్యాషన్‌ డిజైన్‌లో ఉచిత శిక్షణను ఉపయోగించుకోండి
- నిర్వాహకురాలు సాధన జి. ఆశ్రిత్‌

ఫ్యాషన్‌ డిజైన్‌లో ఉన్న విభాగాల ఉచిత శిక్షణ తరగతులను యువత ఉపయోగించుకోవాలని నిర్వాహకులు సాధన జి.ఆశ్రిత్‌ కోరారు. స్థానిక పూర్వపు విద్యార్థి చందన, విలేకరి విజయకుమార్‌, ఆయన కుమార్తె పూజిత ఆహ్వానం మేరకు ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 2 నుంచి 5 వరకు జరిగే ఈ శిక్షణలో చేతి ఎంబ్రాయిడరీ, చేతి కుచ్చు, క్లే జ్యూవెలరీ, బ్రైడల్‌ మేకప్‌, ఫ్యాషన్‌ ఇలస్ట్రేషన్‌ డిజైన్ల తరగతులు ఉంటాయని చెప్పారు. 16-45 ఏళ్ల వయస్సు గలవారు ఈ శిక్షణలో పాల్గొనేందుకు అవకాశం ఉందని తెలిపారు. పది, ఆపైన ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ శిక్షణలో అనేక అంశాలపై అవగాహన కల్పించి, ఎందులో వారికి ఉత్సాహం ఉంటుందో తెలుసుకొని అందులో వారికి సూచనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచి భీమయ్య చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సుమారు 60 మంది విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.