Aug 20,2023 00:46

ప్రజాశక్తి-కాకినాడ ఫ్యాప్టో పిలుపుమేరకు డిఇఒ కార్యాలయం వద్ద బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు వెంటనే మంజూరు చేయాలని, జిఒ 117 రద్దు చేయాలని, వర్క్‌ అడ్జస్ట్మెంట్‌ను నిలుపుదల చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ శనివారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో కాకినాడ జిల్లా చైర్మన్‌ తోటకూర రవి చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులపై అదనపు పని భారాన్ని మోపి ఒత్తిడి పెంచుతోందన్నారు. దీనివల్ల విద్యా బోధనలో నాణ్యత లోపిస్తుందన్నారు. అంతేకాక ఉపాధ్యాయుల ఆరోగ్యం దెబ్బ తింటోందన్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది వాలంటరీ రిటైర్మెంట్‌కు దరఖాస్తు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు కెవి.నగేష్‌ మాట్లాడుతూ బదిలీలు ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు మూడు నెలలు గడుస్తున్న నేటికీ జీతాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమన్నారు. కో చైర్మన్‌ కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ బదిలీలు జరిగి రెండు నెలలలో వర్క్‌ అడ్జస్ట్మెంట్‌ అంటూ ఉపాధ్యాయులను పాఠశాలల్లో కుదురుకోనివ్వకుండా చేయడాన్ని నిలుపుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.అన్న రాము, సంక్షేమ పథకం కార్యదర్శి ఎన్‌.గోవింద రాజులు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శులు పెద్దిరాజు, సీతారామయ్య, సూరిబాబు, ఎస్‌టియు సీనియర్‌ నాయకులు సుబ్బరాజు, యు.శ్రీను పాల్గొన్నారు. అనంతరం డిఇఒకు వినతిపత్రం ఇచ్చారు.