కడప అర్బన్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన జిపిఎస్‌ను రాష్ట్ర ప్రభు త్వం మంత్రి మండలి తీర్మానం చేయడాన్ని నిరిస్తూ సోమవారం ఫ్యాప్టో నాయ కులు నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ముట్టడి సంద ర్భంగా ఉదయం నుంచే పోలీసులు కలెక్టరేట్ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. డిఎస్‌పి షరీఫ్, సిఐ నాగరాజు, ఎస్‌ఐ సయ్యద్ హాసన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఫ్యాప్టో నాయకులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మాదన విజయకుమార్, ట్రెజరర్ వై. వెంకటసుబ్బయ్య, ఎపిటిఎఫ్ (257) రాష్ట్ర ఉపా ధ్యక్షులు ఎ. శ్యాంసుందర్‌రెడ్డి, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహే ష్‌బాబు, ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు పి. రమణారెడ్డి, ఎస్‌టియు జిల్లా నాయ కులు పుల్లయ్యను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నాయ కులతోపాటు, ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అంతకు ముందు ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మాదన విజయకుమార్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే ఈ ప్రభుత్వ అధ్యాయం కూడా ముగుస్తుందనిహెచ్చరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒపిఎస్ ముగిసిన అధ్యాయమని ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మూడున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవన్మరణ సమస్య అయిన పాత పెన్షన్ విధానం పట్ల మంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత కోల్పోతే పదవిలో కొనసాగను అని పదేపదే వల్లె వేసిన సిఎం చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు భిన్నంగా ఉన్న జిపిఎస్ విధానాన్ని అంగీ కరించే ప్రశ్నే లేదన్నారు. ఎపిటిఎఫ్ (257) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.శ్యామ్ సుం దర్ రెడ్డి, ఫోర్టో రాష్ట్ర సెక్రెటరీ జనరల్ అంకాల్ కొండయ్య, ఫ్యాప్టో ట్రెజరర్ వై.వెం కటసుబ్బయ్య, ఏపీ సిపిఎస్ ఈఏ రాష్ట్ర నాయకులు యస్. ఆర్.వి.జనార్దన్ రెడ్డి, ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర కౌన్సిలర్ ఆర్.అబ్దుల్లా మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సిపిఎస్‌కు జిపిఎస్ ప్రతిరూపమే తప్ప వేరొకటి కాదన్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేని పాత పెన్షన్ విధానానమే తమకు కావాలని డిమాండ్ చేశారు. ఆందోళనలపై, ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతోందని ఆరోపి ంచారు. సాధారణ ధర్నాలకు సైతం పోలీసులు ఇళ్లకు వచ్చి నోటీసులు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేసే హక్కును కాలరాయడం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఫ్యాప్టో చేపట్టిన ధర్నాలో ఫోర్టో, ఏపి సిపిఎస్ ఈఏ, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఏపి సిపిఎస్ యూఎస్ సంఘాలు పాల్గొని తమ పూర్తి మద్దతును తెలియ జేశాయి. కార్యక్రమంలో యుటిఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ (257), ఏపీటీఎఫ్ (1938), బిటిఏ, రూట, హెచ్‌ఎంఏ, ఎస్‌ఎల్టీఏ, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం, ఏపీ సిపిఎస్ ఈఏ, ఏపీ సిపిఎస్ యూఎస్ సంఘాల నాయకులు నాగరాజు, వై.రవికుమార్, కె.నరసింహారావు, సంగమేశ్వర్ రెడ్డి, బి.కె.సురేష్, ఈ.ఈశ్వరయ్య, కె.రమేష్ యాదవ్, భోగా గంగాధర్, బి.రామగోపాల్ రెడ్డి, ఖాదర్ బాషా, కొండారెడ్డి, పుల్లయ్య, హిఫాజుతుల్లా, చెన్నకేశవులు, పాలకొండయ్య, సర్తాజ్ హుస్సేన్, రవి శంకర్ రెడ్డి, కె.గంగయ్య పాల్గొన్నారు.










