ప్రజాశక్తి -కలెక్టరేట్ : ప్యాప్టో జిల్లాశాఖ ఆధ్వర్యాన శనివారం స్థానిక డిఇఒ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు 3నెలలు జీతాలు చెల్లించాలని, పని సర్దుబాటును రద్దు చేయాలని, జిఒ117 ను రద్దు చేయాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని ఉపాధ్యాయులు మోకాళ్లపై నిల్చొని నిరసన చేపట్టారు. ఈ నిరసననుద్దేశించి హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్‌శ్రీనివాసరావు మాట్లాడుతూ బదిలీలు జూన్‌లో జరిగాయని, అప్పటి నుంచి ఉపాధ్యాయులకు 3 నెలల నుండి జీతాలు చెల్లించక పోవడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్ రావు మాట్లాడుతూ పని సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారని, మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా బోధన జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఎపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల బాలకృష్ణ మాట్లాడుతూ విద్యారంగాన్ని నాశనం చేస్తున్న జీవో 117ను వెంటనే రద్దు చేయాలన్నారు. శాప్ నాయకులు గోవిందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చి సిపిఎస్ రద్దు చేసే ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు టి.రమేష్, ఎపిటిఎఫ్ నాయకులు ఆర్. అప్పలనాయుడు, ఎం. శివు నాయుడు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










