Aug 12,2023 23:23

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సిపియస్‌ రద్దు, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్న 117 జిఒ రద్దు, పెండింగ్‌ డిఎ, పిఆర్‌సి బకాయిలు విడుదల చేయాలని, బదిలీ, ప్రమోషన్‌ పొందిన ఉపాధ్యాయుల రెండు నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ శనివారం ఉపాధ్యాయులు కాకినాడలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద 12 గంటల ధర్నాకు ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లా ధర్నా చౌక్‌ వద్ద 12 గంటల ధర్నా చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నా రాము శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌ టి.రవి చక్రవర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లో సిపియస్‌ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులను మోసం చేసి కొత్తగా జిపిఎస్‌ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కుట్రను తిప్పికొట్టడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ ఉద్యమిస్తామని తెలిపారు. ఫ్యాప్టో కన్వీనర్‌ కాశీ విశ్వనాధం మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పాఠశాల విద్యారంగం నుంచి తప్పుకోవడానికి చూస్తున్నదని, అందులో భాగంగా 117 జిఒ తెచ్చి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోందన్నారు. 117 జిఒ వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాము మాట్లాడుతూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ పర్యటించి ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఇకనైనా ఆయన తన వైఖరి మార్చుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పిఆర్‌సి బకాయిలు 10 ఏళ్లపాటు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందని, బకాయిలు ఈ సంవత్సరం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకర వర్మ, ఎపిటిఎఫ్‌ నాయకులు సుబ్రహ్మణ్యం, ఫిలిప్‌ రాజు, జిహెచ్‌ఎం అసోసియేషన్‌ నాయకులు కూర్మారావు, యుటిఎఫ్‌ అధ్యక్షుడు కెవివి.నాగేశ్వరరావు, ఎస్‌టియు నాయకులు ఎం.శ్రీనివాస్‌, యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి పివిఎన్‌.గణేశ్వరరావు, జిల్లా సహాధ్యక్షురాలు బి.నాగమణి, జిల్లా కార్యదర్శులు ఎంవి.సాయిరాం, ఎస్‌.వీరబాబు తదితరులు పాల్గొన్నారు.