Jan 04,2023 00:14

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, చిత్రంలో రంపచోడవరం ఐటిడిఎ పిఒ గనోరే తదితరులు

ప్రజాశక్తి - రంపచోడవరం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రంపచోడవరం మండలం బందపల్లి, ఊట్ల గ్రామాలను జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. ముందుగా బందపల్లి గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ క్యాంపులకు వచ్చిన గర్భిణులను, చిన్నపిల్లల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధిత వ్యాధులకు మందులు అందజేయాలని ఆదేశించారు. ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అన్ని స్కూళ్లను పరిశీలించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనారోగ్యంగా ఉన్న పిల్లలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. మందపల్లి గ్రామపంచాయతీ రేషన్‌ కార్డులు పెండింగ్‌లో ఉన్న వాటిని ఈకేవైసీ చేయించాలన్నారు. అనంతరం ఊట్ల గ్రామపంచాయతీని కలెక్టర్‌ పరిశీలించారు. గ్రామంలో తాగునీరు సరిపోవటం లేదని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా వెంటనే కలెక్టర్‌ స్పందించి తాగునీరు ఏర్పాటు చేయుటకు ప్రతిపాదన తయారు చేయించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ వెంట గ్రామ సచివాలయాల సిబ్బంది, సర్పంచులు ఉన్నారు.
స్పందనకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలి
స్పందనకు వచ్చిన సమస్యలన్నీ పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్ని మండలాలకు సంబంధించిన వివిధ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరం నుండి జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన వివిధ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందనకు వచ్చిన సమస్యలన్నీ అప్లోడ్‌ చేసి సంబంధిత దరఖాస్తుదారునికి రసీదులు ఇవ్వాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పింఛన్‌లను ఎంపీడీవోలు కోఆర్డినేటర్లు నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు. రేషన్‌ కార్డు పెండింగ్‌లో ఉన్న వాటిని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవిన్యూ అధికారులు పరిష్కరించాలని సూచించారు. టూరిజం ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరువేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు డేవిడ్‌రాజు, నాగేశ్వరరావు, వెలుగు ఎపిడి శ్రీనివాసరావు, ఎంపీడీవోలు ఎంవిఆర్‌ కుమార్‌ బాబు, వివేక్‌, డిపిఎం అపర్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు చైతన్య బాబు, రాజేంద్ర బాబు, రంగనాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చింతూరు సబ్‌ కలెక్టర్‌ పర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, హౌసింగ్‌ ప్రొజెక్టర్‌ డైరెక్టర్‌ బాలు నాయక్‌ ఎంపీడీవోలు పాల్గొన్నారు.