Feb 16,2023 23:13

లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది,

ఎడిఎంహెచ్‌ఒ డా.లీలాప్రసాద్‌
ప్రజాశక్తి-పాడేరు టౌన్‌:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ వైద్యసేవలను ప్రజలు అనారోగ్య పీడితులు, దీర్ఘకాలిక రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎడిఎంహెచ్‌ ఒ డాక్టర్‌ లీలాప్రసాద్‌ సూచించారు. గురువారం పాడేరు మండలం మినుములూరు పిహెచ్‌సి, గుత్తులపుట్టులో నిర్వహించిన ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య శిబిరాన్ని సందర్శించారు. వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను పరిశీలించి, క్లినిక్‌లో గర్భిణులు, శిశువులు, రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మాత శిశు మరణాల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీలు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. తాగునీరు, అంటువ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
అనంతరం పాడేరులోని లోచలిపుట్టు జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల-1లో) జిల్లా ఆసుపత్రి వైద్యులు, మినుములూరు పిహెచ్‌సి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. 458 మంది విద్యార్థులకు గాను 452 మందికి ఆరోగ్య తనిఖీలు చేయగా, వారిలో 56 మంది రక్తహీనత, చర్మ వ్యాధులు, దగ్గు, తక్కువ బరువు, కంటి చూపు, చెవి, దంత సమస్యలు తదితర వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సికిల్‌సెల్‌ ఎనీమియా అనుమానిక కేసులుగా నలుగురిని గుర్తించి, వైద్యపరీక్షలకు జిల్లా ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. పాఠశాలలోని డైనింగ్‌హాల్‌, కిచెన్‌, సిక్‌ గది పరిశీలించారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య విద్యను విద్యార్థులకు బోధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడేరు డివిజన్‌ అన్ని పిహెచ్‌సిల పరిధిలోని పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందించడంతోపాటు, మెరుగైన వైద్యం అవసరమైతే పై ఆసుపత్రులకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసి, ఎయిడ్స్‌, టిబి అధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరరావు, వైద్యాధికారి డాక్టర్‌.కె.బాబ్జి, ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ మౌనిక, ఎపిడమిక్‌ సెల్‌ ఆరోగ్య విస్తరణాధికారి జి.సింహాద్రి, హెల్త్‌ అసిస్టెంట్‌ బి.ఎలీషారావు, అన్నపూర్ణ, జిల్లా ఆసుపత్రి, మినుములూరు పిహెచ్‌ సి, 104 వైద్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.