
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హేమంత్
ప్రజాశక్తి-కె.కోటపాడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ పథకం చాలా గొప్పదని, దీని ద్వారా పేదలకు ఇంటి వద్దే వైద్య సేవలు అందుతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హేమంత్ అన్నారు. మండలంలోని ఎల్‌వి.పాలెం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ శైలజ అవినీతిపై మెడికల్ సిబ్బంది ఆరోపణలు చేసిన నేపథ్యంలో శుక్రవారం డిఎంహెచ్‌ఒ ఆ పిహెచ్‌సిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య బృందం ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజలు గుండె, బిపి, సుగర్ వంటి జబ్బులతో సతమతమవుతున్నారని, పేదలకు 60 రకాల పరీక్షలు ప్రతి పిహెచ్‌సిలో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. నాటు వైద్యం, ఆర్‌ఎంపి వైద్యులకు ప్రజలు కనెక్ట్ అవ్వడంతో ఉపయోగం లేని మందులు ఎక్కువగా వాడి పలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. అర్హత లేని వైద్యుల వల్ల ప్రాణాలకు ప్రమాదమన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ శైలజ, మెడికల్ సూపర్ వైజర్ జి.సన్యాసిరావు, సిబ్బంది పాల్గొన్నారు.