Aug 28,2023 22:04

వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డిఐఒ జగన్మోహనరావు

ప్రజాశక్తి -గరుగుబిల్లి :గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా అందజేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం  చేసుకోవాలని డిఐఒ టి.జగన్మోహనరావు కోరారు. మండలంలోని దత్తివలస గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా 104 వాహనంలో ఉన్న వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ పరీక్షల కిట్లు, మందులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వీటి ఆవశ్యకతను అక్కడున్న వారికి వివరించారు. గర్భిణులకు 104 వాహనంలో వైద్య సిబ్బంది నిర్వహించిన ఇసిజి రిపోర్టును ఆయన పరిశీలించారు. ప్రజలు చెప్పే అనారోగ్య సమస్యలను పూర్తిగా విని ఆయా సందర్భాల్లో వైద్య పరికరాలను ఆరోగ్య తనిఖీలకు వినియోగించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఒపి రికార్డులో నమోదు చేసిన రోగుల అనారోగ్య సమస్యలు, నిర్వహించిన పరీక్షలు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. వివరాలన్నీ ఎఫ్‌డిపి యాప్‌లో నమోదు చేయాలన్నారు. సీజనల్‌ జ్వరాలు గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేసి, తగు చికిత్సలు అందజేయాల్సి ఉందన్నారు. జ్వరాలు తగ్గే వరకు క్షేత్ర స్థాయి సిబ్బంది పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కర్రి అరుణకుమారి, సూపర్‌వైజర్‌ జయగౌడ్‌, వైద్య సిబ్బంది జి.సురేష్‌ కుమార్‌, సోములమ్మ, దుర్గాభవాని, 104 సిబ్బంది శివగణేష్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.