
ప్రజాశక్తి - గణపవరం
ప్రభుత్వం నిర్వ హిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు వినియోగించుకోవాలని పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కె.ప్రియాంక అన్నారు. సోమవారం సిహెచ్.అగ్రహారంలో నిర్వ హించిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు వైద్యం మరింత దగ్గరగా అందించే విధంగా ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెలకు మూడుసార్లు గ్రామాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 104 వాహనం ద్వారా వృద్ధులకు బిపి, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రికి రాలేని స్థితిలో ఉన్న గర్భిణులకు, రోగులకు వారి ఇంటి ఇంటి వద్దకు వైద్య బృందం వెళ్లి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చుక్క అప్పారావు, ఎంపిటిసి సభ్యులు పివి.నారాయణ, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, ఆరోగ్య సహాయకులు నామాల రాజు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.