ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్
ఫ్యామిలీ డాక్టర్ విధానం పక్కాగా అమలు చేయాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్ అన్నారు. మండలంలోని బందలుప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు, ఒపి యూనిట్, జనరల్ వార్డ్, డ్రగ్స్ స్టోర్, శానిటేషన్‌ను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. రోగులతో మాట్లాడి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం నర్సిపురంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పరిశీలించారు. ఫ్యామిలీ డాక్టర్ శిబిరం ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించి, పనులను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను పిఒ ఆదేశించారు. అనంతరం నర్సిపురంలోని 1,2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అంగన్వాడీ కార్యకర్తను ఆదేశించారు. వారికి అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ఐటిడిఎ కార్యాలయంలో జల జీవన్ మిషన్, ఇతర పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్. డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, తదితరులు పాల్గొన్నారు.










