Apr 07,2023 00:10
ఫ్యామిలి డాక్టర్‌ ప్రోగ్రాంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

ప్రజాశక్తి-వేమూరు, బాపట్ల జిల్లా: ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే గొప్ప వరమని జిల్లా కలెక్టర్‌ కె విజయకృష్ణన్‌ అన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని వేమూరు మండల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో లాంఛనంగా జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన 104 అంబులెన్స్‌ వాహనాన్ని, వైద్య సేవలను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రారంభిం చగా ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా తిలకించేలా వేమూరులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలంతా ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని ఇంటివద్దకే వైద్య సేవలను అందించే బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఇందుకోసం గత ఏడాది ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించిందన్నారు. ఇప్పటివరకు 80 శాతంగా ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వివరాలను సేకరించినట్లు తెలిపారు. నిరుపేదల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆరు గ్రామాలలోని సుమారుగా 2,500 మంది జనాభాకు ఇంటివద్ద వైద్యం అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు. ఆయా గ్రామాలు సందర్శించేలా ఆ కేంద్రం పరిధిలో 104 అంబులెన్స్‌ వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. 12 రకాల వైద్య పరీక్షలు, 160 రకాల ఔషధాలు ప్రజలకు పంపిణీ చేసేలా నూతన వ్యవస్థకు రూపకల్పన చేసిందన్నారు. సంబంధిత డాక్టర్‌ ఆ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలిస్తారన్నారు. తదుపరి నడవలేని స్థితిలో ఉన్న పేదలకు వైద్యం అందించేలా ఇంటింటిని వైద్యులు సందర్శిస్తారని వివరించారు. ఆడపిల్లల జననం నుంచి గర్భిణి, బాలింతల వరకు సంరక్షించేలా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఆడపిల్లలు బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పిహెచ్‌సిల పరిధిలో కాన్పులు జరగాలనే ఉద్దేశంతో పర్యవేక్షణ కమిటీలను నియమించామన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. వైద్యం చేయించుకోలేక అనారోగ్యంతో ఎవరూ మృతి చెందరాదనే లక్ష్యంతో ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రేపల్లె ఆర్‌డిఓ పార్థసారథి చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించిన నూతన విధానంతో ప్రజలంతా ఆరోగ్యంతో సుభిక్షంగా ఉంటారని ఆయన వివరించారు. ముఖ్యంగా రక్తహీనత నివారణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వైద్యాధికారులే పేదల ఇంటికి వచ్చి మంచి వైద్యం అందిస్తారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ విజయమ్మ తెలిపారు. బాపట్ల జిల్లా వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద 1.50 లక్షల మంది ప్రజలు ప్రైవేట్‌ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం పొందారన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి వెంకటేశ్వర్లు, జడ్‌పిటిసి జి హేమలత, తహశీల్దారు, ఎంపిడిఓ, అధికారులు పాల్గొన్నారు.