ప్రజాశక్తి- పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్‌లో భాగంగా అంబులెన్సులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఐటిడిఏ కార్యాలయం వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అంబులెన్సు వాహనం ూర్తిగా పరిశీలించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో అందించనున్న వైద్య సేవలు, వైద్య పరీక్షలు, వాహనంలో ఉన్న మందుల వివరాలను వైద్యాధికారులను అడిగితెలుసుకున్నారు. అంబులెన్సులో 67 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వైద్యులు జిల్లా కలెక్ట కు వివరించారు. గర్భిణులకు, బాలికలు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. వీరికి యాంటీనెటల్, పోస్టునెటల్ పరీక్షలు చేస్తారని తెలిపారు. నవజాత శిశు సంరక్షణ సేవలు అందిస్తారన్నారు. అంగన్వాడీలను సందర్శించి రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందిస్తారన్నారు. గ్రామంలో మంచాన పడి ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాదులతో బాధపడే వారికి ఇళ్లకు వెళ్లి వైద్య సేవలందిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు టి.నరసింగరావు, జిల్లా వైద్యాధికారి జమాల్ బాషా, జాయింట్ డైరెక్టర్ .దేవి, రీజనల్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ బి.సుజాత, అదనపు జిల్లా వైద్యాధికారి కె. లీలా ప్రసాద్, డిటిసిఓ విశ్వేశ్వరరావునాయుడు పాల్గొన్నారు.










