Apr 16,2023 23:35

ఫుట్‌పాత్‌పై అడ్డంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌

పాదచారుల రాకపోకలకు ఇక్కట్లు
ఎమ్మెల్యే వాసుపల్లి విద్యాసంస్థల నిర్వాకం
ప్రజల ఆగ్రహం...పట్టించుకోని అధికారులు.
ప్రజాశక్తి -గాజువాక
: ఎమ్మెల్యేకు చెందిన విద్యాసంస్థ కావడంతో ఎవరే చేస్తారన్న అధికార దర్పమో? లేక ప్రజల సౌకర్యాలంటే నిర్లక్ష్యమో తెలియదు గానీ, ఏకంగా ఫుట్‌పాత్‌ను ఆక్రమించేసి, పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా ప్రచార హోర్డింగ్‌ ఏర్పాటు చేసేశారని పలువురు మండిపడుతున్నారు. గాజువాక జివిఎంసి జోనల్‌ కార్యాలయం ఎదురుగా, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు చెందిన విద్యాసంస్థ బోర్డు ఫుట్‌పాత్‌పై అడ్డంగా ఏర్పాటు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే... జివిఎంసి గాజువాక జోనల్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డులో పాదచారుల కోసం రూ.10 లక్షల జివిఎంసి నిధులతో ఫుట్‌పాత్‌ నిర్మించారు. నిత్యం భారీ వాహనాల రాకపోకలతో రద్దీ ఉండే ఈ మార్గంలో పాదచారుల రాకపోకలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు చెందినదిగా చెపుతున్న విశాఖ డిఫెన్స్‌ అకాడమీ రామబాణం పేరుతో భారీ హోర్డింగ్‌ను ఫుట్‌పాత్‌కు అడ్డంగా ఏర్పాటు చేశారు. దీని వల్ల పాదచారుల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నా, ఎదురుగా జివిఎంసి జోనల్‌ కార్యాలయం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులేవీ దీన్ని జోలికి వెళ్లరు.
గతంలోనూ ఇక్కడే అదే ఎమ్మెల్యేకు చెందిన కాలేజీలో ఐదో అంతస్తును అధికారులకు సంప్రదించకుండా నిర్మాణం చేపట్టిన సందర్భంలోనూ ఒక అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. పది మందికి ఆదర్శవంతంగా ఉండాల్సిన ఎమ్మెల్యేకు సంబంధించిన విద్యాసంస్థ ఇలా అడ్డగోలు చర్యలతో ప్రజలకు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు ఎం రాజేంద్రప్రసాద్‌, అధికారుల తక్షణమే స్పందించి ఫుట్‌పాత్‌కు అడ్డంగా పెట్టిన ప్రచారబోర్డులను తొలగించాలని డిమాండ్‌ చేశారు.