ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం కూడలిలో ఫుట్ పాత్‌లపై వ్యాపారాలు నిషేధించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాఫిక్ ఎసిపి కుమారస్వామి పోలీసులకు సూచించారు. ఆనందపురం కూడలిలోని పూల మార్కెట్ ఫుట్‌పాత్‌లను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆనందపురం కూడలిలో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలుగుతుందన్నారు. చిరు వ్యాపారస్తులు, పువ్వులు అమ్మేవారు రోడ్లపై విక్రయాలు చేపట్టడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. వాహనాలను రోడ్లపై నిలపరాదని పేర్కొన్నారు. ఆనందపురం పూల మార్కెట్‌లో వ్యాపారస్తులు రోడ్లపై కాకుండా మార్కెట్లోనే అమ్మే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
వేములవలస పూల మార్కెట్ ఆసీలు వసూలు చేసే వారితోను, ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులతో మాట్లాడారు అనంతరం రోడ్డు కిరువైపులా ఉన్న షాపుల వ్యర్థ పదార్థాలను తొలగించారు. ఫుట్ పాత్‌ల నుంచి రోడ్డుపైకి రాకుండా రైలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ విజరుకుమార్, ట్రాఫిక్ ఎస్‌ఐ రఘురామ్, లా అండ్ ఆర్డర్ ఎస్‌ఐ నరసింహమూర్తి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.










