Nov 07,2021 12:46

ఆ ఊరిలోని మహిళలు తమ ఇష్టానుసారంగా చదువుకోవడానికి లేదు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అంతకన్నా లేదు. బాల్య వివాహాలు చేయడం అక్కడ సర్వసాధారణమైన విషయం. కానీ ఇవన్నీ ఇప్పుడు కాదు ఒకప్పుడు. నేడు వారంతా దేశం పేరు నిలిపే ఫుట్‌బాల్‌ క్రీడాకారులు. ఇంతలా వారిలో మార్పు తెచ్చిన వ్యక్తి జార్ఖండ్‌లోని కర్మ గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఆనంద్‌కుమార్‌ గోప్‌. ఆటతోనే సామాజిక అసమానతలను రూపుమాపే దిశగా ప్రయాణిస్తున్న అతని గురించి మరెన్నో విశేషాలు...

రాంచీకి సమీపంలో ఉన్న జార్ఖండ్‌లోని కర్మ గ్రామంలో ఎక్కువమంది గిరిజన సమాజానికి చెందినవారే. ఆ ఊరి యువతులకు ఇంటిపని తప్ప బయటి ప్రపంచం పెద్దగా తెలియదు. చాలామంది యువతులు హైస్కూలు ముఖమే చూడలేదంటే అతిశయోక్తి కాదు. నిండా పదేళ్లు నిండక మునుపే పెళ్లి చేసి, అమ్మాయిలను రాష్ట్రాలు దాటించడం అక్కడ మామూలు విషయమే. ఇదంతా ఒకప్పుడు. కానీ నేడు ఆ ఊరి యువతులు వారి భవిష్యత్తు కోసం కలలు కంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ క్రీడాకారులుగా కోట్లాది మంది దేశ ప్రజల మన్ననలు పొందుతున్నారు. దీనంతటికి ఆనంద్‌ మాత్రమే కారణం.
 

                                            మూస పద్ధతులకు చరమగీతం..

ఆనంద్‌ ఫుట్‌బాల్‌ లైసెన్స్‌ ఉన్న కోచ్‌. 'నా చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్‌ ఆడుతున్నాను. నా ఆసక్తిని గమనించిన మా తల్లిదండ్రులు నన్నెంతగానో ప్రోత్సహించారు. 2010, 2011, 2012లో రాంచీ లీగ్‌, జిల్లా స్థాయిలలోనూ ఆడాను. జాతీయ స్థాయిలో ఆడాలంటే మంచి శిక్షణ తీసుకోవాలి. అందుకోసం దూరప్రాంతాలకు వెళ్లాలి. కానీ అదే సమయంలో కుటుంబ బాధ్యత అనుకోకుండా నా మీద పడింది. అందుకే నా కలను వదులుకున్నా. మా గ్రామంలో చాలామంది తమ ఇంటి ఆడపిల్లలను పాఠశాల సమయంలోనే చదువులు మాన్పించి, బాల్య వివాహాలు చేయడం చూశా. చాలా బాధేసింది. నాలోని క్రీడా నైపుణ్యాన్ని సామాజిక ప్రయోజనం ఉండేలా ఉపయోగించాలని నిర్ణయించుకున్నా' అంటున్నారు ఆనంద్‌.

 

ఫుట్‌బాల్‌తో బాల్య వివాహాలకు చెక్‌ !


    ఎలాగైనా ఆ ఊరి ప్రజల మనస్సుల్లో నాటుకుపోయిన మూస పద్ధతులకు చరమగీతం పాడాలి అనుకున్నారు ఆనంద్‌. అందుకోసం ఫుట్‌బాల్‌ను ఎంచుకున్నారు. అయితే తమ కుమార్తెలను ఫుట్‌బాల్‌ ఆటకు పంపడానికి మొదట్లో ఎవరూ ఒప్పుకోలేదు. పిల్లలను పెంచడానికి, కుటుంబాన్ని ముందుకు నడిపించడానికీ ఫుట్‌బాల్‌ ఉపయోగపడదు అనేది వారి ఉద్దేశ్యం. మరో ప్రయత్నంగా యువతులతో ఆట గురించి మాట్లాడటం మొదలెట్టారు ఆనంద్‌. అబ్బాయిలు ఆడటం చూడటమేగానీ, బాల్‌ను తాకలేదని వారు చెప్పిన మాటలు అతనిలో మరింత పట్టుదల పెరిగేలా చేశాయి. ఆరునెలలు అతను ఎక్కని గడపంటూ లేదు. చివరికి 2013 అక్టోబరులో 15 మంది బాలికలు ఫుట్‌బాల్‌ ఆడటానికి వారి తల్లిదండ్రులను ఒప్పించగలిగారు. 'ఫుట్‌బాల్‌ ఆట కోసం అమ్మాయిలు షాట్‌లు ధరించడంపై స్థానికులు అసహ్యంగా మాట్లాడటం మొదలెట్టారు. బాలికలు ప్రాక్టీసుకు వచ్చేటప్పుడు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. రానురాను ఆ మాటలకు బాలికలు అలవాటుపడ్డారు. వాటిని పట్టించుకోవడం మానేశారు. త్వరగా ఇంటిపని ముగించుకుని, ప్రాక్టీసుకు వచ్చేవారు. చదువు మానేసిన బాలికలను మరలా పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులను ఒప్పించగలిగా. ప్రస్తుతం 250 మంది బాలికలు, 50 మంది బాలురకు ఫుట్‌బాల్‌ శిక్షణ ఇస్తున్నా. బాలికల్లో ఎనిమిది నుంచి 18 సంవత్సరాల వారు ఉన్నారు. వారిలో ఎక్కువమందికి బూట్లు లేవు. కొందరు దాతల సాయంతో కొందరికి మాత్రమే క్రీడా సామగ్రిని అందించగలుగుతున్నా' అంటున్నారు ఆనంద్‌.
 

                                             త్వరలో ఫిఫా ప్రపంచకప్‌లోనూ..

ఇప్పటి వరకూ ఆనంద్‌ శిష్యులు సుమారు 25 మంది జాతీయస్థాయి టోర్నమెంట్స్‌లో జార్ఖండ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు. తమ శిష్యులైన అనితాకుమారి, సోనీ 2022 ఫిఫా ప్రపంచకప్‌కు ఎంపికయ్యారని సంతోషంగా చెబుతున్నారు ఆనంద్‌. ఆయన శిష్యుల్లో ఒకరైన ఫిఫా అండర్‌- 17 సెలెక్టర్‌ అనితాకుమారి మాట్లాడుతూ 'మా అమ్మ కూలిపని చేస్తుంది. నాన్న ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. ఆనంద్‌ సార్‌ మంచి శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులు తీసుకునే ఆహారం ఇంటి దగ్గర మాకు లభించదు. ప్రభుత్వ సహకారం అందిస్తే మేము దేశానికి మంచిపేరు తెస్తాం' అంటోంది. 'ఒకరోజు నా శిష్యుల్లోని 13 ఏళ్ల అమ్మాయి ప్రాక్టీసుకు రాలేదు. రాజస్థాన్‌కు చెందిన యువకునితో ఆమెకు వివాహం జరిగిందని తెలిసింది. వెంటనే ఆమె తల్లిదండ్రులను కలిశాను. బాల్యవివాహాలపై చట్టం ఏమి చెబుతుందో వివరించాను. అంతే ఇరువర్గాల పెద్దల అంగీకారంతోనే ఆ పెళ్లిని రద్దు చేశారు. అదే అమ్మాయి తర్వాత జార్ఖండ్‌ అండర్‌-14 జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అంతేకాదు తజికిస్థాన్‌లో భారత జట్టు తరపున ఆడింది' అంటున్నారు ఆనంద్‌. ఎన్నో దశాబ్దాలుగా ఆ గ్రామ ప్రజల్లో నిండుకుని ఉన్న సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి చేశారు ఆనంద్‌. తన కల నెరవేరకపోయినా నేడు ఎందరికో భవిష్యత్తుపై కలలు కనేలా చేసిన ఆయన నేటి యువతకు ఆదర్శం.