ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఫుట్‌బాల్ సంఘం సహకారంతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ మహిళల అంతర్ జిల్లా ఫుట్‌బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. అనంతపురం జిల్లా జట్టు విజేతగా నిలవగా తర్వాతి రెండు స్థానాలను సత్యసాయి జిల్లా, కడప జిల్లాలు సాధించాయి. బహుమతులను ఆంధ్రప్రదేశ్ ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ పి.రాజశేఖర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి వర్సిటీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. క్రీడల్లో అత్యున్నత మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. క్రీడ వసతి గృహం, ఆధునిక సింథటిక్ ట్రాక్, అవుట్ ఫీల్డ్స్, ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ జిమ్, యోగ సెంటర్ వంటివి ఉన్నట్లు తెలిపారు. జాతీయ, రాష్ట్రీయ, జోనల్ స్థాయి క్రీడా పోటీలెన్నో నిర్వహించామని గుర్తు చేశారు. ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడల నిర్వహణలో యూనివర్సిటీ సహకారం మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో ఎమ్‌డి సిరాజుద్దీన్, ఫుట్ బాల్ పూర్వ శిక్షకులు సుధాకర్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, వ్యాయామ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
బహుమతిని అందుకుంటున్న మొదటి స్థానంలో నిలిచిన అనంతపురం జిల్లాజట్టు