Sep 11,2022 23:22

విజేతలకు షీల్డ్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి, ఏలూరు ఎంపీ కోటగిరి

ప్రజాశక్తి -తగరపువలస : చిట్టివలస ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఈ నెల 5న ప్రారంభమైన ఉత్తరాంధ్ర స్థాయి ఫుట్‌ బాల్‌ టోర్నమెంట్‌ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. అక్కరమాని అప్పలనాయుడు మెమోరియల్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 14 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీ రామకృష్ణ ఫుట్‌ బాల్‌ క్లబ్‌ (ఎస్‌ఆర్‌కెఎఫ్‌సి (విశాఖ) విన్నర్స్‌గా, చిట్టివలస శ్రీ పొలమాంబ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎస్‌పిఎంఎఫ్‌సి) రన్నర్స్‌గా నిలిచాయి. విన్నర్స్‌కు షీల్డ్‌తో పాటు రూ.20 వేలు, రన్నర్స్‌కు షీల్డ్‌తో పాటు రూ.15 వేలు బహుమతులు అందజేశారు.
తొలి క్రీడ ఫుట్‌ బాల్‌: కోటగిరి శ్రీధర్‌
ప్రపంచ స్థాయిలో ఫుట్‌బాల్‌ క్రీడ ఎంతో ప్రాచర్యం పొందిందని, తొలి క్రీడగా చెప్పుకోవచ్చని ఎపి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. ఈ క్రీడలో ఎపి దురదృష్ట వశాత్తూ గత కొన్నేళ్లుగా వెనుకబడి ఉందని అవేదన వ్యక్తంచేశారు. ఈ క్రీడను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతిష్టాత్మకంగా టోర్నమెంట్‌ నిర్వహించిన అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి చినబాబును అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ముని శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా సహాయ కార్యదర్శి కె.నవీన్‌కుమార్‌, సీనియర్‌ క్రీడాకారులు సివి.రావు, జిల్లా కార్యదర్శి అక్కరమాని చినబాబు, పిఎసిఎస్‌ అధ్యక్షులు అక్కర మాని రామునాయుడుతో కలిసి ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.